Tuesday, December 10, 2024

NZB | జక్రాన్ పల్లి విమానాశ్రయం.. ప్ర‌తిపాద‌న‌లు రాలేదన్న కేంద్ర మంత్రి

నిజామాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 6 (ఆంధ్రప్రభ) : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జక్రాన్ ప‌ల్లి వద్ద నిర్మించాలన్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి స్థల అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. లోక్ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అడిగిన ప్రశ్నకి ఆయన బదులిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విమానాశ్రయాల నిర్మాణానికి ఆరుచోట్ల ఫ్రీ ఎలిజిబిలిటీ అధ్యయనం నిర్వహించిందని, అందులో భాగంగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బ్రౌన్ ఫీల్డ్, నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా వీలున్నట్టు గుర్తించిందని తెలిపారు. ఈ మూడుచోట్ల ఎయిర్ పోర్టులు నిర్మించాలంటే అబ్స్టకిల్ లిమిటేషన్ సర్వీ సెస్ సర్వే (ఓఎల్ఎస్) నిర్వ హించి, కేంద్ర పౌర విమానయానశాఖ, ఇతర రెగ్యులేటరీ, చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు తీసుకోమని తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సూచించిందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో భేటీ అయిన ఎంపీ అర్వింద్
ఇదే అంశంపై శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును వారి కార్యాలయంలో ఎంపీ అర్వింద్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యి, అనుమతుల జాప్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు జక్రాన్ పల్లి విమానాశ్రయ నిర్మాణం, అందుకు స్థలం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, ఏళ్లుగా ఓఎల్ఎస్ సర్వే పెండింగ్ లో ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మీడియా ప్రకటన విడుదల చేస్తూ… ఓఎల్ఎస్ సర్వే చేస్తే ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభమవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపిన తరువాత అతి త్వరగా జక్రాన్ పల్లిలో విమానాలు దిగే ఆస్కారం ఉందన్నారు. ఏళ్లుగా సర్వే పెండింగ్ లో ఉంటే గత సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విమానాశ్రయ ఏర్పాటు అంశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవ తీసుకొని కేంద్రానికి త్వరగా ప్రతిపాదనలు పంపాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement