ప్రభన్యూస్ ప్రతినిధి/సూర్యాపేట : సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై రైతు బంధు విషయంలో చేసిన వాఖ్యలపై మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చేది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మాత్రమేనని అది కూడా 5 నెలలు ఆలస్యంగా ఇచ్చినందుకు సిగ్గుపడాలన్నారు. ప్రమాణ స్వీకారం రోజే డిసెంబర్ 9న రైతు భరోసా ఇస్తానని చెప్పి రైతు బంధు కొనసాగింపు డబ్బులు మాత్రమే ఇస్తామని మాటదాటేస్తున్నారన్నారు. మంత్రి వర్గంలోని వ్యవసాయ మంత్రే రైతు భరోసా రాలేదని చెప్పాడని ఆ మంత్రిని ఏ చెప్పుతో కొడతారని ప్రశ్నించారు.
నాలుగు నెలల్లో ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో లేరన్నారు. 65 లక్షల మంది రైతులకు ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిన రైతు బంధేనని కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా కాదన్నారు. మోదీ రైతు వ్యతిరేక విధానాలు అవలంభించి రైతు ఆగ్రహానికి గురై చట్టాలను వెనక్కి తీసుకొని చెంపలు వేసుకున్న విధంగా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు 7500 కోట్లు రైతు బంధు కోసం సిద్ధం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నగదును కాంట్రాక్టర్లకు పంచిపెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే జాలేస్తుందని, తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్కు చాలెంజ్ చేయడానికి సిగ్గుండాలన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి మే 13న పోలింగ్ కేంద్రాల్లో శిక్ష వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.