వీకెండ్ డోస్.. అంతరించిపోతున్న పిచ్చుక జాతి
ఫొటో షేర్ చేసిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఒకప్పుడు ఇండ్లలోకి వచ్చి.. కిచ కిచమని శబ్దాలతో ముచ్చటగొలిపే పిచ్చుకలు మచ్చుకైనా కనిపించడం లేదు. గుంపులుగా గుంపులుగా చేలపై వాలి.. జొన్నచేలు, వడ్ల కంకులకు పట్టే చీడపీడలను తినే రైతు మిత్రుడు లేనే లేడు.
పచ్చని చెట్లపై వాలి పర్యావరణానికి మేలుచేసే నీ జాడ ఏమాయే! కార్పొరేట్ రక్కసి వెదజల్లిన పురుగుమందులకు భయపడి పచ్చని జొన్న చేలు వీడావు. వరి పొలాలకు దూరమయ్యావు. ఇళ్లల్లో నీ గూళ్లను తుడిచేసిన సెల్ టవర్ రక్కసి నుంచి ఎవరూ కాపాడలేకపోయారు. ఇక.. అంతరించిపోతున్న జాతిని కాపాడుకోవడానికి అడవిలో దాక్కున్నావా.. అంటూ నెటిజన్లు పిచ్చుక ముచ్చట్లను యాది చేసుకుంటున్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు, పర్యావరణ హితుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కెమెరా కన్నుకు చిక్కిన చిన్నారి పిచ్చుక సహజ సౌందర్యాన్ని వీక్షించి.. గతాన్ని అవలోకనం చేసుకుని మురిసిపోతున్నారు. వీకెండ్ డోస్ పేరిట గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త పెట్టిన పోస్టుకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.