ఖమ్మంలో రైతు గోస–బీజేపీ భరోసా బహిరంగ సభ జరిగింది. ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగించారు. తెలంగాణలో డబులింజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందని, సీఎం కేసీఆర్‌ని సాగనంపాలని అన్నారు. అమిత్‌షా హిందీ ప్రసాంగానికి పార్టీ సీనియర్ నేత కే. లక్ష్మణ్ తెలుగు అనువాదం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై అమిత్‌షా మండిపడ్డారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ విముక్తికి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. కేసీఆర్ సర్కార్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ 75 విముక్తి దినోత్సవం త్వరలోనే రాబోతోంది. ఓవైసీతో కలిసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిని అవమానించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రజాకార్ల పక్కన కూర్చొని పరిపాలిస్తోంది. ఇక.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్ గద్దె దిగిపోవాల్సిందే. సంపూర్ణ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుంది.
దక్షిణ అయోధ్యగా భద్రాచలం పేరుగాంచింది. భద్రాచలం రాముడికి ముత్యాల తలంబ్రాలు సమర్పించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కేసీఆర్ విడిచిపెట్టారు. భద్రాచలం వస్తారు కానీ, రాముడిని దర్శించుకోరు. ఎందుకంటే ఆ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా? కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేస్తారా.? మజ్లిస్ చేతిలో ఉన్న కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలపై దాడులు చేస్తే వాళ్లు ఆగిపోతారని అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి బయటికి పంపించారు. ఎన్నో పథకాల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
ఇక.. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతుల కోసం 22వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెడితే.. ఇవ్వాల ప్రధాని మోదీజి రైతుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం లక్షా 25వేల కోట్ల బడ్జెట్ పెట్టారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు.