హైదరాబాద్ సిటీలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడ మోస్తరు జల్లులు కురిశాయి. మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, చందానగర్, మెహిదీపట్నం, మాదాపూర్, మూసాపేట, షేక్‌పేట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 నిమిషాల పాటు వర్షం కురిసింది. 10 మి.మీ. కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
రాబోయే నాలుగు రోజులు కూడా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో శనివారం గరిష్టంగా 29.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే నాలుగు రోజుల్లో 27 – 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.