హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ శతాబ్దం అతిపెద్ద మానవ విజయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీర్తించారు. ప్రపచంలోనే అతిపెద్ద భారీఎత్తిపోల పథకమని ఆయన చెప్పారు. పరాయిపాలన ఒక శాపంగానూ, స్వపరిపాలన ఒకవరంగా ప్రజలు కీర్తిస్తున్నారన్నారు. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా,కోటి మంది చంద్రబాబులు కొంగజపాలుచేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. అయితే ఇంటిదొంగలు, పాలోల్లు, పక్కవాళ్లు కేసులు వేసి ఆపాలని చూసినా సీఎం కేసీఆర్ పట్టుదలతో అనుమతులన్నీ పొంది నిర్మిస్తున్న ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అని ఆయన చెప్పారు.
16న నార్లాపూర్ ప్రాజెక్టు వెట్ రన్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తొమ్మిదేళ్లుగా కృష్ణా నదిలో తెలంగాణ నీటివాటాను తేల్చకుండా అవరోధాలు సృష్టించిందని విచారం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులుపెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహానికి ప్రతి వ్యూహం అల్లి రాజ్యాంగ బద్దంగా అనుమతులు సాధించి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో దశలవారిగా నిధులు సేకరించుకుని ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించుకుంటున్నామన్నారు. దశాబ్దాల కాలం క్రితమే కృష్ణా నీళ్లు పాలమూరుకు దక్కి ఉంటే దేశంలోనే పాలమూరు హరిత ప్రాంతంగా అవతరించేందన్నారు.
వ్యవసాయం, అనుబంధాల రంగంలో పాలమూరు అగ్రభాగాన ఉండేదన్నారు. ఈ ప్రాంతంలో బానిస మనస్తత్వం, వెన్ను ఎముక లేని తనం పోలమూరు ప్రజలకు శాపంగా మారిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి అభివృద్ధివైపుకు పరుగులు తీస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రభుత్వం లోనే పూర్తి చేసుకున్నామన్నారు. ఈ నెల 16న కేసీఆర్ చేతులమీదుగా పాలమూరు రంగారెడ్డి పంపు వెట్ రన్ తో పాలమూరు ప్రజల కల నెరవేరనుందని చెప్పారు. పాలమూరులోని ప్రతిపల్లెకు కృష్ణా జలాలు రాబోతున్నాయి. ఉమ్మడి పాలనలో పాలమూరు ఆకలి చావులు, వలసలకు కేంద్రంగా నిలవగా సాధించుకున్న తెలంగాణలో పాలమూరు పచ్చబడనుందన్నారు. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ జలాశయం వెట్ రన్ కు ప్రజలంతా తరలి రావాలని ఆయన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.