ఆంధ్రప్రభ బ్యూరో, అదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు అవసరమయ్యే పత్తి విత్తనాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధ ప్రాతిపదికన విత్తనాలు సమకూర్చాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిని కలిసి అదిలాబాద్ జిల్లా పత్తి రైతుల సమస్యలు విన్నవించారు.
రాశి 659 రకం విత్తనాలపై రైతులు అధికంగా మొగ్గు చూపుతున్నందున యుద్ధప్రాతిపదికన రెండు లక్షల 50 వేల విత్తనాల సంచులను వెంటనే పంపించి రైతుల సమస్యలు తీర్చాలని కోరారు. కల్తీ విత్తనాల వ్యాపారాన్ని పకడ్బందీగా అరికట్టి, మహారాష్ట్రకు విత్తనాలు తరలించకుండా, బ్లాక్ మార్కెట్ సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పత్తి విత్తనాల సమస్యపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందని వెంటనే విత్తనాలు అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు.