హైదరాబాద్ – ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి.సోమవారం ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్, సిబ్బంది, ఇంటి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరిపారు. మై హోం శాఖలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.
తాజాగా రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మూడురోజులుగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి అనుచరుడి ఇంట్లో నిర్వహించిన ఐటీ సోదాలు నేటితో ముగిసాయి.. మూడు రోజులుగా ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. నరేందర్ రెడ్డి ఇంట్లో 7 కోట్ల 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐదు కోట్ల కు కు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ అధికారులు స్పష్టం చేశారు. మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు తేల్చారు.
అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఇక తాజాగా.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.. . ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. కాగా.. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్, మాజీ మంత్రి జానా రెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ దాడులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పరస్పరం కుమ్మక్కయ్యాయని, తమ పార్టీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు గ్రూపుల వారీగా ఐటీ దాడులు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్‌ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో నిర్వహించిన ఐటీ సోదాలు నేటితో ముగిశాయి.