Monday, November 25, 2024

TS | కబ్జా కోరులను జైలుకు పంప‌డం హర్షణీయం.. ఎస్పీ చిత్రపటానికి పాలాభిషేకం

తొర్రూరు టౌన్, (ప్రభన్యూస్): పైసా పైసా కూడబెట్టి కూసింత జాగా కొన్న పేదలను బెదిరించి ఆక్రమించేందుకు యత్నించిన కబ్జా కోరులను జిల్లా ఎస్పీ జైలుకు పంపించడం హర్షణీయమని బాధితులు పేర్కొన్నారు. మ‌హ‌బుబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారు పాలకేంద్రం సమీపంలో పేదలు కొనుగోలు చేసిన భూములను కబ్జా చేసేందుకు విఫల యత్నం చేసిన పలువురిని ఎస్పీ జైలుకు పంపడాన్ని హర్షిస్తూ ఇవ్వాల (మంగళవారం) డివిజన్ కేంద్రంలో బాధితులు ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఆసం చిలుకమ్మ 2010 ఫిబ్రవరిలో మండలంలోని వెలికట్ట శివారు పాలకేంద్రం సమీపంలో 156 సర్వే నెంబర్ లో 303 గజాల భూమి.. మిరియాల నరేందర్ రెడ్డి దగ్గర కొనుగోలు చేసింది. చిలుకమ్మ కొనుగోలు చేసిన భూమి సర్వే నెంబర్ మార్చి ధరణి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల సమయంలో స్థానికుడు బసనబోయిన వెంకన్న అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఇతరులకు దొంగ సర్వే నెంబర్ తో విక్రయించాడు. అది తెలుసుకున్న చిలుకమ్మ
ఇటీవల సదరు భూమిలో చిన్నపాటి గది నిర్మించారు. ఆ భూమిపై కన్నేసిన వెంకన్న ఆ నిర్మాణాన్ని కూల్చి ఆక్రమించుకోజూసాడు.

ఈ అన్యాయంపై బాధితులు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ఆశ్రయించారు. సమస్య తెలుసుకున్న ఎస్పీ ఎస్సై గండ్రాతి సతీష్ తో విచారణ జరిపించి వెంకన్న, పనస మధులను నిందితులుగా తేల్చారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనలో ఎస్పీ బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేసినందుకు.. స్థలాలు కొనుగోలు చేసిన వారు హర్షం వ్యక్తం చేశారు. కష్టార్జితంతో కొద్దిపాటి స్థలాన్ని కొనుగోలు చేసి ఎలాంటి అండలేని వారికి న్యాయం చేయడంలో పోలీస్ శాఖ కృషి మరువలేనిదని, ఎస్పీ శరత్ చంద్ర పవార్ కబ్జాకోరులకు సింహ స్వప్నంగా మారారని బాధితులు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement