నిజామాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తి అయింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హంగులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్..ఇందూరు ప్రాంతానికి సరికొత్త ఐటీ సొబగులను తెచ్చిపెట్టింది. బైపాస్ రోడ్డు సమీపంలో ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టగా… దీన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో మూడు అంతస్తుల్లో ఐటీ టవర్‌ను నిర్మించడంతో నిజామాబాద్ కళకళలాడుతోంది.
ఈరోజు ఐటీ మంత్రి కేటీఆర్ ఈ హబ్‌ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌లు ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో న్యాక్ సెంటర్, మినీ ట్యాంక్ బండ్, మూడు వైకుంఠ దామాలను మంత్రి ప్రారంభించనున్నారు.
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ గులాబీ మయంగా మారింది. భారీ ఎత్తున ఫ్లెక్సీలు కటౌట్లు ఎర్పాటు చేశారు.ఐటీ టవర్ ప్రారంభం అనంతరం కేటీఆర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేయనున్నారు, ఆ తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్న తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్,, మహబూబ్‌నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఐటీ హబ్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.