Friday, November 22, 2024

మహిళా జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి, ప్రత్యేక మీడియా అకాడమీ ఏర్పాటు.. 5ల‌క్ష‌లు ఆర్థిక సాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళా జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున తోడ్పాటు అందిస్తామన్నారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ తరపున మహిళా జర్నలిస్టులకు ఆర్థిక సాయం కింద ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శనివారం పర్యటక భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీత లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి, మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పాల్గొన్నారు.

అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జర్నలిస్టులు 400 మందే ఉన్నారని, వారి సంఖ్య పెరగాల్సివుందన్నారు. సాంకేతికత విస్తరిసున్న ్త నేపథ్యంలో వృత్తిపరంగా మహిళలు నిలదొక్కువాలన్నారు. ఇటీవల జరిగిన దళిత జర్నలిస్టుల శిక్షణలో రెండు వేలమంది దళితులు పాల్గొనడం సామాన్య విషయం కాదన్నారు. ఈ ఏడాది జరిగిన మహిళా దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా మహిళా జర్నలిస్టులను సన్మానించామని ఆమె గుర్తు చేశారు. వంటింట్లో కూరగాయలు తరిగే కత్తి, జర్నలిస్టుగా కలం పట్టి రెండింటిని సమర్ధవంతంగా నిర్వహించగల శక్తి మహిళా జర్నలిస్టులకు ఉందన్నారు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించన ఘనత మాజీ సిఎం ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు.

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సిఎం కేసీఆర్‌ ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సమాజంలో మహిళలు వివక్ష స్టేజ్‌ను దాటేశారన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యనందించే ప్రతిపాదనను సిఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మహిళా జర్నలిస్టు పాత్ర మరిచపోలేదని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజంలో మహిళ పాత్ర ముఖ్యమైనదని, రాసే ప్రతి అక్షరంతో సమాజంలో మార్పు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. మీడియా కార్యాలయాల్లో పని చేసే మహిళ జర్నలిస్టులకు సంబంధించి వర్క్‌ప్లేస్‌ వేధింపులపై కమిటీని వేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ వారి పట్ల ఇంకా వివక్ష కొనసాగడం దురదృష్టకరమన్నారు. మహిళల్లో ప్రతిభ తక్కువేమీ లేదని, కాకపోతే వారికి అవకాశాలు దక్కడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement