Thursday, September 19, 2024

TG: పట్ట‌ప‌గ‌లే ఎమ్మెల్యేపై హ‌త్యా ప్ర‌య‌త్న‌మా..? మండిపడ్డ కేటీఆర్

కౌశిక్ రెడ్డిపై దాడి అప్ర‌జాస్వామిక‌మే
ఇటువంటి ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డం
చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య‌ల ఉంటుంది

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచి, పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గూండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ మండిపడ్డారు.

- Advertisement -

గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలు చేసి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర జరుగుతోందని, ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచిన పోలీసులు… అరికెపూడి గాంధీని కౌశిక్ రెడ్డి ఇంటికి రానివ్వటానికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. వందల మంది రౌడీలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసినట్లు పక్కా ముందస్తుగా ప్లాన్ చేసిన దాడి అని కేటీఆర్ పేర్కొన్నారు. పూర్తిగా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కౌశిక్ రెడ్డిపై దాడి జరిగిందని ఆరోపించారు. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తుంటే జాలేస్తుందని వ్యాఖ్యానించారు.

అక్రమ కేసులు, దాడులతో బెదిరించడమే మూర్ఖత్వమని, ఇందిరమ్మ పాలన అంటే ప్రజా ప్రతినిధులపై దాడులు చేయించడమా ? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే చాలు ప్రభుత్వం దాడులకు తెగబడుతోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచ్చితంగా రాసిపెట్టుకుంటామని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇంతకంటే పెద్ద ప్రతిఘటన తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement