- ఆ రెండు పార్టీలు.. పొలిటికల్ డ్రామాలు
- కేబినెట్ ఆమోదం లేకుండా కోట్లు మళ్లించిన కేటీఆర్
- చర్యలు తీసుకునే ధైర్యం లేని సీఎం
- అడ్డగోలుగా తిడుతున్నా.. చలనం లేని రేవంత్
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేబినెట్ ఆమోదం లేకుండానే కోట్ల నిధులు దారి మళ్లించిన మాజీ మంత్రి కేటీఆర్ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా? ఈ ఫార్ములా రేస్ స్కాంలో కేటీఆర్ వ్యవహారిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కేబినెట్ అనుమతి లేకుండా సర్కార్ సొమ్మును అప్పనంగా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా నిధులు ఎలా విడుదల చేశారని, తప్పు చేసి కప్పి పుచ్చుకోవడానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్లు డ్రామాలాడుతున్నారన్నారు. రూ.700 కోట్ల లాభం ఎట్లా వచ్చిందో లెక్క చెప్పాలని, లాభం వచ్చిన సొమ్ము యాడ ఉందో ప్రజల ముందుంచాలని అన్నారు.
అడ్డగోలుగా తిడుతున్నా.. చలనం లేని రేవంత్
ఒక సీఎంను లొట్టపీసు సీఎం, చిట్టినాయుడు, సన్నాసి అంటూ తిడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతు చిక్కడం లేదని సంజయ్ అన్నారు. కేటీఆర్ తిడుతున్నా సీఎంలో చలనం లేదని, అరెస్ట్ చేయకుండా విచారణ పేరుతో జాప్యం చేయడాన్ని చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కేసీఆర్‌తో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు అనుమానం వస్తుందన్నారు.
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతున్న కేసీఆర్
బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన స్కామ్‌లు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని బండి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఈ రెండు పార్టీల రాజకీయ డ్రామాలను ఎండగడతామన్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నేతల అవినీతిని, కేసీఆర్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.