వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు… ఇవ్వాల సీఎం కేసీఆర్ యాదాద్రికి పోయి దేవుడిని దర్శించుకున్నాడని సీరియస్ కామెంట్స్ చేశారు మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. దేవునికి దక్షిణ కింద బంగారం సమర్పిస్తే చేసిన పాపాలు పోతాయా అని ప్రశ్నించారు. దోపిడీ చేసి దేవునికి దండం పెడితే సరిపోద్దని అనుకుంటున్నాడేమో, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తన దోపిడీ చేయలేదని విమర్శించారు పొన్నాల లక్ష్మయ్య.
వరంగల్‌లోని దేవాదుల ప్రాజెక్టు కు ఈ 8 ఏళ్లలో 3 పేజ్ మోటార్లు నడిపి ఒక్క టీఎంసీ అయిన నీరు ఇచ్చారా? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు పొన్నాల. 8 సంవత్సరాల్లో ఏం ఒరగబెట్టారని వరంగల్ లో దేవాదులపై సమాధానం చెప్తారని మండిపడ్డారు. వరంగల్ లో 8 ఏళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఒక్క పైసా అయిన ఖర్చు చేశారా? దీనికి రేపు వరంగల్ పోయినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వరంగల్ అభివృద్ధి కి ఏడాది 500 కోట్లు ఇస్తా అన్న కేసీఆర్.. మొదటి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టారు. బాగానే ఉంది.. కానీ, నయా పైసా విడుదల చేదలేదని విమర్శించారు. అంతేకాకుండా వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ఏమైంది? వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తా అన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్య.
మూడు నెలల్లో వస్తా అని చెప్పి.. కనీసం డబుల్ బెడ్ రూం ఇళ్లకు పునాది కూడా వేయలేదని మండిపడ్డారు పొన్నాల. 8 ఏళ్లలో అక్కడ ఒక్క ఇళ్లయిన కట్టారా? కట్టినవి ఇచ్చారా? అని విమర్శలు గుప్పించారు. ఇక కేసీఆర్ పని అయిపోయిందని, శేష జీవితం అంతా చంచల్ గూడ జైల్లోనే గడపాల్సి ఉంటుందన్నారు. వరంగల్‌లో మల్టిస్పెషలిటీ హాస్పిటల్ ఏమైంది? 150 కోట్లు ఏవి? అక్కడికి వచ్చిన ఎక్విప్మెంట్ చెదలు పడుతుంది కానీ, ఎట్లాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. 2013 డిసెంబర్ లో వరంగల్ ఎయిర్‌పోర్టు పనులు మొదలు పెట్టాలని అప్పట్లోనే 25 కోట్లు కేటాయించామని, ఇక.. కోచ్ ఫ్యాక్టరీకి భూసేకరణ జరిపిన చరిత్ర కాంగ్రెస్ దే.. కానీ ఇంతవరకు కోచ్ ఫ్యాక్టరీ మొదలుపెట్టించలేదన్నారు.. రేపు వరంగల్ వచ్చినప్పుడు ఏమైనా చేస్తాడని ఆశిస్తున్నా అన్నారు పొన్నాల.. ఎక్కడైనా జాతీయ పార్టీలకు సొంత ఫ్లైట్ లు ఉన్నాయా? ఈయన 80 కోట్లు పెట్టి దోచుకోవడానికి సొంత ఫ్లైట్ కొంటాడట అని ఎద్దేవా చేశారు పొన్నాల లక్ష్మయ్య.