సిద్దిపేట : కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నాయకులపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవర్ బ్రోకర్లు, అవకాశవాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారని, అలాంటి వారంతా పనికిరాని ఆకుల మాదిరిగా పార్టీని వీడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ మన పార్టీ నుంచి కొంతమంది నాయకులు బయటకు పోతున్నారు.. కార్యకర్తలు ఎవరూ వెళ్లడం లేదు. ఎవరైతే మధ్యలో మన పార్టీలోకి వచ్చారో.. పవర్ బ్రోకర్లు, అవకాశవాదులు పార్టీని విడిచి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఎవడైతే పార్టీ నుంచి పోయారో.. రేపు కాళ్లు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేదని పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో వారిని పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదు.
కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టే. ఇది అన్యాయం కాదా..? ఏం తక్కువ చేసింది పార్టీ వారికి.. అన్ని అవకాశాలు ఇచ్చింది. పార్టీకి అండగా నిలబడ్డ నాయకులను, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇది ఆకులు రాలేకాలం.. ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులు చెత్తకుప్పలో కలిసిపోతున్నాయి. ఆకులు పోయాక మళ్లీ కొత్త చిగురు వచ్చి ఆ చెట్టు వికసిస్తుంది. కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పని చేసేపార్టీ. అసలు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాడా..? ఉద్యమంలో జై తెలంగాణ అనలేదు. ఇప్పుడు కూడా అనడం లేదు. కనీసం ఏనాడైనా అమరవీరుల స్థూపం వద్ద రెండు పూలు పెట్టలేదు. తెలంగాణ మీద ప్రేమ లేదు ఆయనకు. తెలంగాణ కోసం పోరాడింది మనం.
రాజకీయంగా లబ్ది పొందేందుకు వారు దుష్ర్పచారం చేస్తున్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అడ్డా.. మెదక్ ఎంపీ స్థానంలో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలిచి తీరాల్సిందే. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో పట్టున పది మంది లేకున్నా.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి.. రానే రాదు కానే కాదు అన్న తెలంగాణ తెచ్చి పెట్టిండు. తెలంగాణ వస్తదంటే ఆ రోజు ఎవరూ నమ్మలేదు.. కానీ కేసీఆర్ తెలంగాణను తెచ్చిపెట్టిండు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.