Tuesday, November 26, 2024

Delhi: కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు.. ఢిల్లీ జంతర్‌మంతర్ రైతు ధర్నాలో బీజేపీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కమీషన్ల కోసమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు తప్ప రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశం లేదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులు, బీజేపీ నేతలు ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులు తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. మాజీ ఎంపీ, తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ నేతలు రైతులకు సంఘీభావంగా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. చెన్నూరు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం చెల్లించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ధనవంతులను చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే ధనవంతులుగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. మంచిర్యాల బీజేపీ నేత అందుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ… నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఇది మర్చిపోయి జాతీయ పార్టీ, భారత రాష్ట్ర సమితి అంటూ సీఎం కేసీఆర్ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రాంతానికి ఒక కాంట్రాక్టర్ ప్రపంచంలోనే ధనవంతుడిగా మారారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా 10 వేల ఎకరాలకు పైగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు పరిహారం దక్కడం లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కారణంగా చెన్నూరు నియోజకవర్గ రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని అన్నారు.

కోటగిరి, చెన్నూరు, జైపూర్ మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తమ పొలాలు నాలుగేళ్లలో మూడుసార్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకుంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం కేసీఆర్, ముందు తన రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మధుసూధన్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement