Friday, September 13, 2024

TG: ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ గోపాల్..

వరంగల్ క్రైమ్, ఆగస్టు 12 (ప్రభ న్యూస్) : ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న గుగులోతు గోపాల్ రూ.6 వేల లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. హనుమకొండ నక్కలగుట్టలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతంలో రూ.6 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇవాళ‌ పట్టుబడ్డారు. పాలకుర్తి మండలంలో చేసిన పనుల బిల్లుల చెల్లింపున‌కు రూ.10వేలు డిమాండ్ చేయడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికారులు అందించిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం గుడికుంట తండా గ్రామ మాజీ ఎంపీటీసీ భానోత్ యాకుబ్ గతంలో కొన్ని పనులు చేశారు. సదరు బిల్లుల చెల్లింపుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ కుంటిసాకులు చెబుతూ అనవసర కాలయాపన చేస్తున్నారు. దాంతో వర్క్స్ కాంట్రాక్టర్ విషయమేమిటంటూ ఇరిగేషన్ ఏఈ గుగులోతు గోపాల్ ను అడిగారు. పెండింగ్ బిల్లు చెల్లింపున‌కు రూ.10వేలు ఇవ్వాలని బేరసారాలు ఆడారు. చేసిన పనికి పెట్టిన పెట్టుబడులకే మిత్తి కూడా గిట్టుబాటు కావడం లేదని చింతిస్తుంటే, బిల్లు క్లియర్ కోసం రూ.10వేలు డిమాండ్ చేయడంతో గుడికుంట తండా మాజీ ఎంపీటీసీ భానోత్ యాకుబ్ విసిగి వేసారి పోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

దాంతో రంగంలోకి దిగిన‌ అధికారులు వేసిన ట్రాప్ లో ఇరిగేషన్ ఏఈ గుగులోతు గోపాల్ చిక్కాడు. రూ.6వేలు లంచం తీసుకొంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇరిగేషన్ ఏఈ గోపాల్ గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారా, బినామీ పేర్లతో దందాలు కొనసాగించారా, గతంలో పనిచేసిన చోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement