హైదరాబాద్ మహానగరం ఐపీఎల్ ఫీవతో ఊగిపోతుంది. ఉప్పల్ వేదికగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటెత్తనున్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ను వీక్షించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
‘క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది.’ అని ఎక్స్‌లో సజ్జనార్ ట్వీట్ చేశారు.