మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రాధమిక దర్యాప్తు పూర్తి చేశారు. దీంతో దేవాదాయ అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆలయ ఈవో చంద్రమోహన్ ను తప్పించిన ప్రభుత్వం.. దేవాదాయశాఖ ట్రిబ్యునల్ మెంబర్ జ్యోతిని సైతం తప్పించారు. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సీతరామ స్వామి టెంపుల్ ఈవోగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కి అదనపు భాద్యతలు అప్పగించారు. కీలక ఫైల్స్ ఐఎఎస్ కమిటీ స్వాదీనం చేసుకుంది. ఇక రోజువారి విచారణ కోసం తత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. వివిధ శాఖలనుండి సీనియర్ అధికారులను కమిటీకి సహకరించేందుకు కేటాయించారు.
కాగా, దేవరయంజాల్ దేవాలయ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్, ఇతరులు భూములు ఆక్రమించారన్న ఫిర్యాదులపై కమిటీ ఏర్పడింది. సీతారామ స్వామి భూములు ఆక్రమణ చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు కమిటీలో ఉన్నారు. ఎంత భూమి ఆక్రమించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఐఏఎస్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.