Friday, November 22, 2024

Internal War – కాంగ్రెస్ లో ర‌గులుతున్న అంస‌తృప్తి – బిసి.. మ‌రోసారి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ఉన్న ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను వెనుకబడిన తరగతులకు (బీసీ) ఇవ్వాలన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రతిపాదన అటకెక్కేలా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ బీసీ అగ్రనేతలు ఈ ప్రతిపాదనను పార్టీ అధినా యకత్వం ముందుంచినా సాధ్యమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. తెలంగాణాలో 17 పార్లమెంట్‌ స్థానాలుండగా ఒక్కో సెగ్మెంట్‌ నుంచి రెండు చొప్పున 34 అసెంబ్లీ సీట్లను బీసీలకు ఇవ్వాలని ఇటీ-వల జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ- (పీఏసీ) సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ సీటు-ను కూడా బీసీ సామజిక వర్గాలకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం ఉన్నప్పటికీ అవి జనరల్‌ స్థానాలుగా నిర్ణయించిన సంగతి విదితమే. కాగా ఈ లోక్‌సభ పరిధిలో మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లు- ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలుగా ఉన్నాయి. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు జనరల్‌ స్థానాలైనప్పటికీ ఇక్కడ ఒక్క సీటు-ను కూడా బీసీ వర్గాలకు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. 1989 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి ముందస్తు ఎన్నికల వరకు కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు కేటాయిస్తూ వస్తోంది. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కొత్తగూడెం నుంచి బరిలో ఉంటూ వచ్చారు. బీసీలలో బలమైన మున్నూరు కాపు సామాజిక వ ర్గానికి చెందిన వనమా వెంకటేశ్వరరావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పక్షాన గెలిచి అనంతరం చోటు-చేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా గులాబీ గూటికి చేరారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన కారు పార్టీ నుంచి పోటీ-కి సిద్ధమవుతున్నారు.

పాలేరు, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లు- జనరల్‌ స్థానాలు అయినప్పటికీ ఇక్కడ ఆది నుంచి అగ్ర వర్ణాలు బరిలో ఉంటూ వస్తున్నాయి. ఈ ఎన్నికలోనూ ఈ వర్గాల అభ్యర్థులకే టికెట్లు- కేటాయించే అవకాశం మెండుగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత యడవల్లి కృష్ణ కొత్తగూడెం సీటు- తనకే వస్తుందని మొన్నటి దాకా గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఇటీ-వల చేరిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఈ టికెట్‌ను ఎగరేసుకుపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో అండగా ఉండి యడవల్లి కృష్ణకు టికెట్‌ ఇప్పించాల్సిన రేణుకా చౌదరి కూడా తన నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్‌ ఏంటన్న విషయంలో కృష్ణ తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నట్టు- ఆయన తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు- చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న వనమా కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరాక కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు చెల్లాచెదురై దిక్కుతోచని స్థితిలో ఉండగా తాను పార్టీ బాధ్యతలను భుజస్కందాలపై వేసుకుని పనిచేశానని, తీరా ఎన్నికల వేళ మరో పార్టీ నుంచి వచ్చిన వలసవాది పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతుండడంతో బీసీ వర్గానికి చెందిన తనకు కాదని ఆయనకు ఎలా ఇస్తారని యడవల్లి కృష్ణ నిలదీస్తున్నట్టు- సమాచారం. పొంగులేటి ఇప్పటికే తనకు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం టికెట్‌ను ఖరారు చేసిందని చెబుతూ కొత్తగూడెంలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు- చేశారని యడవల్లి అనుచరులు చెబుతున్నారు.

కాగా వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరాక యడవల్లి కృష్ణ కొత్తగూడెం నియోజకవర్గ వ్యవహారాలన్నీ అంతా తానై నిర్వహిస్తున్నారు. ఈ నాగున్నరేళ్ళ భారాస పాలనలో అక్రమ కేసులను ఎదుర్కోవడంతో పాటు- తన విద్యా సంస్థలను కూడా పక్కకు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేసినా ఫలితం లేకుండా పోయిందన్న అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తున్నట్టు- సమాచారం. నాలుగేళ్లకు పైగా భారాసలో ఉంటూ కాంట్రాక్టులు పొంది అన్నీ అనుభవించిన పొంగులేటి వంటివారు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోగానే ఆయనకు ఎన్నికల్లో పోటీ- చేసే అవకాశం ఇస్తే పదేళ్లుగా ప్రభుత్వ విధానాలకు, కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి అన్నీ కోల్పోయి అక్రమ కేసులతో న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న నిజమైన నాయకులు, కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం చివరికి ఇచ్చే బహుమానం ఇదేనా అని స్థానిక నేతలు నిలదీస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే ప్రయోజనమేదీ ఉండదనడానికి కొత్తగూడెం వ్యవహారమే చక్కని ఉదాహరణగా ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొంటు-న్నారు. పొంగులేటి ఖమ్మం అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి మంత్రి పువ్వాడ అజయ్‌ను ఓడించాలని, లేకపోతే, పాలేరు నుంచి పోటీ-కి దిగి తన సత్తా చాటాలని.. కానీ బీసీ నాయకుడిని దెబ్బతీసేందుకు కొత్తగూడెం టికెట్‌ ఆశించడంలో ఆంతర్యమేంటని కొత్తగూడెం కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిలదీస్తున్నారు.

మహబూబాబాద్‌ లోక్‌సభలోనూ?
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం తరహాలోనే మహబూబాబాద్‌ పార్లమెంటు- పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. మహబూబాబాద్‌ పరిధిలో ఒక్క నర్సంపేట అసెంబ్లీ మినహా మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ రిజర్వ్‌ కేటగిరి స్థానాలే. కాంగ్రెస్‌లో నర్సంపేట టికెట్‌ను బీసీ వర్గాలకు ఇచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున అగ్రవర్ణ అభ్యర్థిని పోటీ-కి పెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు- సమాచారం. మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉన్న మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు కావడంతో బీసీలకు పోటీ- చేసే అవకాశం లేకుండా పోయింది. కాగా ములుగు జిల్లాలోని ఏ-కై-క నియోజకవర్గం ములుగు ఎస్టీలకు కేటాయించడంతో అక్కడ బీసీలకు పోటీ- చేసే ఛాన్స్‌ లేదు.

- Advertisement -

భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి సెగ్మెంట్‌ జనరల్‌ అయినప్పటికీ ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు అగ్రవర్ణాలకే టికెట్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్‌, గద్వాల అసెంబ్లీ నియోజక వర్గాలున్నప్పటికీ అలంపూర్‌ ఎస్సీ రిజర్వుడ్‌ సెగ్మెంట్‌. గద్వాల అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో అత్యధిక శాతం ఓటర్లు బీసీ సామజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అగ్రవర్ణాలకు ఎప్పటి నుంచో టికెట్‌ను కేటాయిస్తూ వస్తోంది. ఇలా ఏ లోక్‌సభను తీసుకున్నా, జిల్లాను తీసుకున్నా కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి అవకాశం ఇవ్వకపోవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నట్టు- లోక్‌సభ నియోజకవర్గానికి రెండు సీట్ల చొప్పున 34 టికెట్లు- ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement