Wednesday, November 20, 2024

Internal War – కాంగ్రెస్ లో రెడ్డి – బిసిల మధ్య సీట్ల సిగ‌ప‌ట్లు… భ‌ట్టితో వెనుకబడిన తరగతుల నేత‌ల భేటి..

హైద‌రాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ పర్యటన తర్వాత షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్‌ఎస్ కూడా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు చోట్ల త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇక బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు గుర్రాలను వడబోసే పనిలో ధీమాగా ఉంది. అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు సమావేశమైన సభ్యులు 80కి పైగా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్న చాలా నియోజకవర్గాలతో పాటు ఒకే అభ్యర్థి ఉన్న స్థానాల్లో దరఖాస్తులను జల్లెడ పట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాబితా సిద్ధం చేశారు. ఈ నెలాఖరులోగా లేదా అక్టోబర్ మొదటి వారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సమయంలో పార్టీలో టిక్కెట్ల పంచాయితీ తెరపైకి వచ్చింది. అంతర్గతంగా లీకైన తొలి జాబితాలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు లేవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశం కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయితీకి కారణమైంది. తొలిజాబితాలో ఎస్సీ, ఎస్టీ బీసీల పేర్లు ఉంటాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు తమ పేర్లు లేకుండా చేస్తున్న ప్రచారంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ భట్టిని కలిశారు. టిక్కెట్ల కేటాయింపుపై ఆయనతో చర్చించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు రెండు సీట్లు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ ఫలితాలు రాజకీయంగా ముఖ్యమైనవి. ఎన్నికల తరుణంలో టిక్కెట్ల పంచాయితీ తారాస్థాయికి చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement