Thursday, November 21, 2024

డిగ్రీపై ఇంటర్‌ ఎఫెక్ట్‌! ఇంటర్‌లో తగ్గిన ఉత్తీర్ణత శాతం… డిగ్రీలో నిండని సీట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డిగ్రీలో సీట్లు నిండట్లే. గతేడాది కంటే కూడా ఈసారి చాలా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి. డిగ్రీ ప్రవేశాలకు ఆదరణ తగ్గుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఈ విద్యాసంవత్సరం డిఈ అడ్మిషన్లపై ఇంటర్‌ ఫలితాల ప్రభావం కూడా పడిందని చెప్పాలి. దాంతో ఈ ఏడాది డిగ్రీలో చేరేవారు భారీగా తగ్గిపోయారు. ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ గడువును పొడిగిస్తూ.. వస్తున్నా బీటెక్‌లో చేరుతున్నారు గానీ సాధారణ సాంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు ఇష్టపడట్లేదు. డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్‌ నోటిఫికేషన్‌ జులై 23న వెలువడింది. ఇప్పటికే మొదటి, రెండో, మూడో దశ సీట్ల కేటాయింపులు పూర్తికాగా, గురువారం స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ సీట్లను కేటాయించారు. మూడు దశల్లో కలిపి మొత్తం 1,50,662 సీట్లు భర్తీ అయ్యాయి. స్పెషల్‌ ఫేజ్‌లో 36,079 సీట్లను కేటాయించారు. అంటే ఇప్పటి వరకు నాల్గు విడతలు కలుపుకొని కేవలం 1,86,741 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో దాదాపు వెయ్యికి పైగా కాలేజీలు ఉంటే అందులో 978 ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో మొత్తంగా దాదాపు 4.60 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిపిన నాలుగు విడతల్లో నిండిన సీట్లు కేవలం 1.86 లక్షలే. ఏటా డిగ్రీలో దాదాపు 2.50 లక్షల సీట్లు నిండుతున్నాయి. అలాగే 2.10 లక్షల సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ సారి నాలుగు విడతలు కలుపుకున్నా కనీసం 2 లక్షల సీట్లు దాటలేదు. మొత్తం 4.60 లక్షల సీట్లల్లో ఇంకా 2.73 లక్షల సీట్లు మిగిలే ఉన్నాయి.

ఇంటర్‌ ఉత్తీర్ణత తగ్గడంతో…

ఈ సారి డిగ్రీలో అడ్మిషన్లపై ఇంటర్‌ ఫలితాలు ప్రభావం చూపాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా ఇంటర్‌లో పరీక్షలు లేకుండా పాస్‌ కావడం, పాస్‌ మార్కులు కలపడం లాంటివి జరిగాయి. దాంతో డిగ్రీలో అడ్మిషన్లు భారీగా పెరిగాయి. కానీ ఈసారి ఈ ఏడాదిలో ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో మొత్తం 4,42,895 మంది పరీక్ష రాయగా అందులో 2,97,458 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 75.33 శాతం, బాలురు 59.21 శాతం పాసయ్యారు. ఇందులో కొంత మంది ఎంసెట్‌ తదితర కోర్సులవైపు వెళ్లగా మిగిలినవారు మాత్రమే డిగ్రీలో చేరిన పరిస్థితి ఉంది. దీంతో ఈసారి డిగ్రీలో అడ్మిషన్లు 2 రెండు లక్షలు కూడా దాటలేదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇంకా ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. సీట్ల కేటాయింపు రెండ్రోజుల్లో చేపట్టనున్నారు. ఒకవేళ వారికి ఎంసెట్‌లో సీటు రాకుంటే డిగ్రీలో చేరే అవకాశం ఉంది. దీనికోసం స్పాట్‌ అడ్మిషన్లను చేపట్టే వీలుంది.

- Advertisement -

బీఏ ఆర్ట్స్‌ లాంటి కోర్సుల్లో చాలా మంది విద్యార్థులు చేరడంలేదు. దాంతో అడ్మిషన్లు కాలేజీల్లో మిగిలిపోతున్నాయి. విద్యార్థులు చేరని కోర్సులను, సెక్షన్లను ఈసారి రద్దు చేసిటన్లు ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో లక్ష వరకు సీట్లను ఫ్రీజ్‌ (హోల్డ్‌) చేశారు. మొత్తం 4.60 లక్షల సీట్లల్లో లక్ష సీట్లకు కోతపడింది. కాలేజీల్లో 15 అడ్మిషన్ల లోపు ఉండే కోర్సులు, సెక్షన్లు బ్లాక్‌ చేశారు. అయితే వచ్చే ఏడాదిలో మాత్రం హోల్డ్‌లో పెట్టిన ఈ లక్ష సీట్లను అందుబాటులోకి తేనున్నారు. ఆ సీట్లలో కోర్సులు కన్వర్షన్‌ చేసుకుని నడిపించుకునేందుకు కాలేజీ యాజమాన్యాలకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఈ ఏడాది దాదాపు 900 కాలేజీలపై దీనిప్రభావం పడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement