Saturday, November 23, 2024

ఇంటర్‌ కాలేజీలు ఫర్‌ సేల్‌.. నిర్వహణ భారమూ మూసివేత దిశగా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సమయానికి ఇవ్వక, దానికి తోడూ గత రెండేళ్లలో కరోనా ప్రభావం ఇంటర్‌ ప్రైవేట్‌ కాలేజీలపై పడడంతో నిర్వహణ భారంతో వాటిని నడపలేక కొన్ని కాలేజీలు మూతపడే స్థితిలో ఉన్నాయి. నిర్వహణ ఖర్చులు, అప్పులు పెరిగిపోతుండటంతో మేనేజ్‌మెంట్లు కళాశాలలను అమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రూరల్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న కాలేజీలు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. జూనియర్‌ కాలేజీల సంఖ్య రానురాను క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు 1564 ఉన్నాయి. ఇందులో 100 నుంచి 150 మూతపడేందుకు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్లు ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం నేతలు చెప్తున్నారు. వీటిని కొనేందుకు కార్పొరేట్‌ కాలేజీలు ముందుకు వస్తుండటంతో త్వరలోనే ఇవి వారి చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇంటర్‌, డిగ్రీ కాలేజీల బకాయిలు 2020-21లో సుమారు రూ.300 కోట్ల వరకు, 2021-22లో దాదాపు రూ.2600 కోట్లు ఉన్నట్లు తెలిసింది.

ఒకవైపు కళాశాల నిర్వహణ భారం, విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ప్రభుత్వం సకాలంలో చెల్లించడంలేదు. దాంతో అటు ప్రైవేట్‌ కళాశాలలకు, ఇటు విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. మరోవైపు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా సకాలంలో వసూలు కావడం లేదని ఆవేదన్య వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ ఇంటర్‌ కాలేజీల్లో
ఒక విద్యార్థికి సంవత్సరానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తుంటే, ప్రైవేట్‌ కాలేజీలు మాత్రం రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇవి కూడా సకాలంలో వారి చేతికి అందని పరిస్థితి ఉంది. తక్కువ ఫీజులతో కళాశాలలను నడపలేకపోతున్నారు. ప్రభుత్వమైనా సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తే ఈ పరిస్థితి ఉండదని యాజమాన్యాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో మరిన్ని కాలేజీలు మూతపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. నిర్వహణ భారంతో 100 నుంచి 150 కాలేజీలు మూతపడుతుండటంతో అందులో పనిచేసే టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది జీవితాలు రోడ్డునపడ్డట్లేనని అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement