ఎంపీగా, హుస్నాబాద్‌కు ఏం చేశావని ప్రశ్నిస్తే నా తల్లి ఆత్మక్షోభిస్తుందని మాట్లాడతారా? బతికున్న ఆమెను అవమానపరుస్తారా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై ధ్వజమెత్తారు. రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఐదేళ్లు ఎంపీగా ఉన్నా నియోజకవర్గంలో ఒక్కసారి కూడా కనిపించని బండి సంజయ్.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ యాత్రలంటూ నియోజకవర్గానికి వస్తున్నాడని, ఇన్నాళ్లూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆయన దుయ్యాబట్టారు. ఇప్పుడు హుస్నాబాద్ ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ క్రమంలో బండి సంజయ్ యాత్రకు బందోబస్తు కల్పించాల్సి వస్తే పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుందన్నారు. ఇతరత్రా శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతాయని, అందుకే బండి యాత్రను అడ్డుకోవద్దని చెప్పారు. అదే సమయంలో రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు.