Tuesday, November 26, 2024

TS: ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు అన్యాయం… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్​లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగావకాశాల్లో మహిళల హక్కలను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని కవిత మండిపడ్డారు.

తెలంగాణలో ఆడబిడ్డలకే కాకుండా వికలాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగే జీవో 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ను వెనక్కి తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కవిత లేఖ రాశారు.
రోస్టర్​ పాయింట్ల రద్దు చేయొద్దు..
రాష్ట్రంలో ఇప్పటి వరకు మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వర్టికల్ రిజర్వేషన్లతో సమానంగా అమలు చేయాలంటే రోస్టర్ పాయింట్లను పెట్టాలనే ప్రతిపాదన 1996లో తెరమీదికి వచ్చిందని పేర్కొన్నారు. దాంతో జవో 41, 56లను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. 100 ఉద్యోగాల ఉంటే 33 ఉద్యోగాలు కచ్చితంగా మహిళలకు వస్తాయని, అదనంగా మరన్ని ఉద్యోగాలు కూడా వచ్చే ఆస్కారం ఉండేదని వివరించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హారిజాంటర్ రిజర్వేషన్లు అమలు చేస్తూనే రోస్టర్ పాయింట్లు ఎత్తివేయడానికి జీవో 3ని తీసుకొచ్చిందని తెలిపారు. రోస్టర్ పాయింట్లు రద్దు చేయడం వల్ల 100 ఉద్యోగాల్లో మహిళలకు 33 ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనకు భంగం కలుగుతుందని, 33 కంటే తక్కువ ఉద్యోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 16 ఉద్యోగాలు ఉంటేనే ఒక ఎస్సీ మహిళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని ఉదాహరించారు. మహిళలకు రావాల్సిన ఉద్యోగాలు పురుషులకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది రిజర్వేషన్ల స్పూర్తికి భంగం కలిగిస్తుందని, రిజర్వేషన్ల స్పూర్తిని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కే నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం జరుగుతుంది..
టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో దాదాపు 2 లక్షల 60 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే అందులో లక్ష మంది ఆడబిడ్డలు ఉన్నారని తెలిపారు. ఉదాహరణకు ఒకటి నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్లు ఉంటే…. ఓసీలకు 3, ఎస్సీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఒకటి చొప్పున పోస్టులు ఉన్నాయనుకుంటే బీసీ-సీ, ఎస్సీ మహిళకు ఉద్యోగం రావాలంటే శాఖలో కనీసం 16 నుంచి 20 ఉద్యోగాలు ఉంటే తప్పా వాళ్లకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. కానీ ఓసీ ఆడబిడ్డకు మాత్రం కచ్చితంగా ఒక ఉద్యోగం వస్తుందని తెలిపారు.
రిజర్వేషన్ల పద్ధతిలోనూ ఇబ్బందులు తప్పవు..
2022లో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లలో ఆర్టీఏ ఉద్యోగాల భర్తీ చేపడితే గ్రూప్ 1 మల్టీజోన్ 1, గ్రూప్ 2 మల్టీజోన్ కింద 41 ఉద్యోగాలు ఉంటే… మల్టీ జోన్ 1 కింద 19 ఉద్యోగాలు ఉన్నాయని, ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ల పద్ధతిలో ఉద్యోగాల భర్తీ చేస్తే మహిళలకు 6 ఉద్యోగాలు వస్తాయని, కానీ మారిన పరిస్థితుల్లో మూడు ఉద్యోగాలు మాత్రమే మహిళలకు వస్తాయని వివరించారు. మల్టీజోన్ 2లో 23 ఉద్యోగాలు ఉన్నాయని, రోస్టర్ పాయింట్లు తీసివేయడం వల్ల కేవలం 14 శాతం మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయని చెప్పారు. ప్రతీ శాఖపై ఈ ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలను నిర్దేశించకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏది అనిపిస్తే అది చేస్తారని, తద్వారా మహిళల ఉద్యోగావకాశాలకు భద్రత ఉండబోదని స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement