బాయిలర్ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం
కంపెనీపై క్రిమినల్ కేసు నమోదుకు డిమాండ్
ఒక్కో ఉద్యోగికి నష్టపరిహారం కింద రూ.50 లక్షలు
గాయపడిన వారికి రూ.25 లక్షలు
బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి
సంగారెడ్డి, ప్రభన్యూస్: ఎస్‌బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌బీ ఆర్గానిక్స్ ప్రమాదంలో గాయపడి ఎంఎన్‌ఆర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను హరీశ్ రావు పరామర్శించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చికిత్స పొందుతున్న వాళ్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు.
గాయపడినవారు ఎంత మంది ఉన్నారో కంపెనీ యాజమాన్యం చెప్పడం లేదన్నారు. కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గాయపడినవారికి రూ.25 లక్షల చొప్పున సహాయం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని వెల్లడించారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. ప్రమాద ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సహాయం చేస్తామన్నారు. కాగా, కంపెనీలో బాయిలర్ పేలి ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆర్ధిక సహాయం చేయడం తో పాటు అండగా ఉంటామన్నారు…సంఘటన స్థలం ను వారు పరిశీలించారు..బాధితులను అడుకోవాల్సింది పోయి పోలీసుల ద్వారా లాఠీచార్జి చేయిస్తున్నారన్నారు..శిథిలాలను వెంటనే తొలగించాలని అధికారులను, కంపెనీ యాజమాన్యం ను డిమాండ్ చేశారు.
మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ పూర్తి…
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఆయిల్ బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్, నలుగురు కార్మికులు ఇప్పటికే మృతి చెందగా తాజాగా శిథిలాల కింద మరో కార్మికుడి మృతదేహాన్ని సహాయసిబ్బంది గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్ (38)గా గుర్తించారు. మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బౌతికకాయాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు..
ఇది ఇలా ఉంటే గత రాత్రి ఆయిల్ బాయిలర్ నుంచి పొగలు వచ్చిన వెంటనే మంటలు చెలరేగి ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పొగను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో బాయిలర్ పేలడంతో పరిశ్రమ డైరెక్టర్ రవిశర్మ(38) (హైదరాబాద్), కార్మికుల్లో తమిళనాడుకు చెందిన దయానంద్(48), విజయవాడకు చెందిన సుబ్రహ్మణ్యం(36), మధ్యప్రదేశ్‌కు చెందిన సురేష్ పాల్(54) మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారికంగా ప్రకటించారు. చందాపూర్ గ్రామానికి చెందిన చాకలి విష్ణు(35)ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గాయాలైన 16 మందిని అధికారులు సంగారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి..
కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.వెంటనే ఘటన స్థలానికి వెళ్ళి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి కొండా సురేఖ లు ప్రమాద విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు.. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.