నిర్మల్ ప్రతినిధి ప్రభా న్యూస్ : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించిందని, ఇందులో భాగంగా నిర్మల్ బస్టాండ్ ఖాళీ స్థలంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ.34.43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్ కు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి మంత్ర ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 1.3 ఎకరాలలో 43 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యాధునిక హంగులతో మెరుగైన సౌకర్యాలతో కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామన్నారు.
ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ సదుపాయం కోసం సెల్లార్, జి ప్లస్ త్రీ నిర్మాణంలో 53 స్టాళ్లను, శుభకార్యాలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక హాలును నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్, ఇతర సౌకర్యాలతో పాటు ఎల్సిడి తెరలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది లోగా నిర్మాణం పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వారు బస్టాండ్ లో కలియతిరిగారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. తర్వాత నిర్మల్ బస్టండ్ ప్రక్క నుంచి ప్రియదర్శిని నగర్ వేళ్లే రోడ్ ను పరిశీలించారు. ఇరుకైన రహదారితో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 40 ఫీట్ల సీసీ రోడ్ విస్తరణకు ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.