హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఇండోమ్యాక్ ఇండస్ట్రియల్ & మెషినరీ ఎక్స్ పో హైదరాబాద్ 2022 ఎగ్జిబిషన్‌ని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఇవ్వాల ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల పాటు జరగనుంది. కాగా, కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలకు సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో భారీ పరిశ్రమలు, వేరే దేశాల నుండి అధిక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దీనికి TS ipass, TSIIC ద్వారా ఇప్పటి వరకు 15 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు తెలిపారు. ఇంక ముందు రాష్ట్రానికి అనేక పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. పరిశ్రమల స్థాపనకు కేవలం వారం రోజులలో అన్ని రకాల పర్మిషన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ తో పోల్చుకుంటే తెలంగాణలో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.
దాదాపు ఈ ఎక్జిబిషన్ లో 150 స్టాళ్లను ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి అని, ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా గొప్పగా ఉందన్నారు శ్రీనివాస్ గుప్తా. అందరూ ఈ మూడు రోజులు జరిగే ఎక్జిబిషన్ ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో సుమిత్ ఫార్వాల్, సచిన్ శర్మ, సుధీర్ బోలె, మనీష్ సిన్హా, సునీల్, నీటి శుద్దికరణ యంత్రాల డైరెక్టర్ అనిల్ పడకంటి, వివిధ కంపెనీల మేనేజర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.