Wednesday, December 25, 2024

Indiramma Houses – స‌ర్వ‌ర్డౌ న్‌! డేటా ఎంట్రీ చేస్తుంటేనే ఎర్ర‌ర్స్‌

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త అనుమానాలు
స‌రిగా ప‌నిచేయ‌ని ఇందిర‌మ్మ ఇళ్ల యాప్‌
గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వ‌ర్క్ ఇష్యూస్‌
ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో స‌ర్వ‌ర్ డౌన్ స‌మ‌స్య‌లు
ఒక్కో ఇంటికి ప‌లుమార్లు వెళ్తున్న అధికారులు
ప‌దే ప‌దే ఎంట్రీ చేయాల్సి వ‌స్తోంద‌ని సిబ్బంది అస‌హ‌నం
ఒక్కోరోజు ఒక్కొక్క‌రికి 40 ఇండ్ల టార్గెట్‌
క‌నీసం 10 ఇండ్ల న‌మోదు కూడా కావ‌డం లేద‌ని ఆవేద‌న‌
డిసెంబ‌ర్ 31వ‌ర‌కు స‌ర్వే పూర్త‌య్యేనా
ఇందిర‌మ్మ ల‌బ్ధిదారుల్లో మొద‌లైన ఆందోళ‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. అయితే.. ఇది ఎంతవరకూ సాధ్యం అనే డౌట్ చాలామంది నుంచి వినిపిస్తోంది. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి డిఫ‌రెంట్‌గా ఉంది. ఈ మ‌ధ్య‌నే ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల న‌మోదు యాప్‌లో వివరాల్ని నమోదు చెయ్యాల్సి ఉండగా.. ఆ యాప్ సరిగా పనిచెయ్యట్లేదనీ, టెక్నికల్ సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో సంక్రాంతి నాటికి ఈ సర్వే పూర్తవుతుందా అనే అనుమానం చాలామంది వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -

టెక్నికల్, యాప్ సమస్యలు:

గ్రామ‌పంచాయ‌తీలకు, స‌ర్వే సిబ్బందికి గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ట్యాబ్లెట్లు, కొంత‌మందికి ఫోన్ల‌లోనే యాప్ ఇన్‌స్టాల్ చేసింది. సర్వే చేయాల్సిన అధికారులు, సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్ చేసి, అందులో వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, ఇంటింటి సర్వేలో భాగంగా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగా రావట్లేదనీ, అంతేకాకుండా ఎర్ర‌ర్ ఇష్యూస్ ఎదుర‌వుతున్నాయ‌ని తెలుస్తోంది. దీంతో వివరాలు నమోదు చెయ్యడం కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇక‌.. గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, సిటీల్లో కూడా మరో రకమైన సమస్య ఎదుర‌వుతోంది. సర్వర్ సరిగా పనిచెయ్యట్లేద‌ని దీంతో స‌ర్వ‌ర్ డౌన్ వ‌ల్ల కూడా స‌రిగా ఎంట్రీస్ చేయ‌డం లేదని తెలుస్తోంది. ఇట్లా.. సర్వే పని చాలా చాలా నెమ్మదిగా జ‌రుగుతోంది. రోజూ ఒక్కో సర్వేయర్ 40 ఇళ్ల వివరాల్ని నమోదు చెయ్యాల్సి ఉండగా.. క‌నీసం 10 నుంచి 20 ఇళ్ల వివరాల్ని కూడా స‌రిగా ఎంటర్ చేయ‌లేక‌పోతున్న‌ట్టు తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 31వ‌ర‌కు పూర్తి చేసేలా ప్లాన్‌..

తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక సర్వే మొదలైంది. ఈ సర్వే డిసెంబర్ 31వ తేదీ వరకు జరగనుంది. అధికారులు, స‌ర్వే సిబ్బంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు అందుకు సంబంధించి మార్గ దర్శకాలను జారీ చేశారు. కాగా, రోజుకు కనీసం 20 దరఖాస్తులను సర్వే చేయాలన్నది ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ప్రతీ 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉన్నారు. పట్టణాల్లో వార్డు అధికారి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. అదే గ్రామాల్లో అయితే గ్రామ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది వివరాలు సేక‌రిస్తున్నారు.

ద‌ర‌ఖాస్తుదారుల‌కు ముందే స‌మాచారం..

ఒకరోజు ముందుగానే సర్వే గురించి గ్రామాలు, వార్డులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించి పత్రాలను రెడీ చేయాలని ఇప్పటికే తెలిపారు. ఇక కలెక్టర్లు, హౌసింగ్ శాఖ పీడీలు దిగువస్థాయికి వెళ్లి యాప్‌లో వివరాల నమోదు తీరును గమనిస్తున్నారు. ఇళ్లు కేటాయింపులో తొలుత వికలాంగులకు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్ జెండర్లు, సఫాయి కార్మికులు, ఆదివాసీలకు ప్రభుత్వం ప్రయార్టీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇక దరఖాస్తుదారుడు ప్ర‌స్తుతం ఉంటున్న‌ సొంత ఇల్లు లేదా అద్దె ఇంటి ఫొటోలు తీసి అందులో యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

ఖాళీ జాగా వివ‌రాల న‌మోదు

అంతేకాకుండా స‌ర్వేలో ద‌ర‌ఖాస్తుదారుల ఖాళీ స్థలాల వివరాలు సేకరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అసలైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇక‌.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు వచ్చాయనే ఆరోప‌ణ‌లున్నాయి. ఈసారి అలాంటి విమ‌ర్శ‌లు రాకుండా నిజ‌మైన లబ్ధిదారులను మాత్ర‌మే ఎంపిక చేసి, వారికి స‌రైన న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కార్ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement