Saturday, January 11, 2025

TG | ఇందిర‌మ్మ ఇళ్లు.. ఎస్సీ, ఎస్టీకు అద‌నంగా మ‌రో ల‌క్ష‌.. భట్టి విక్రమార్క

  • సంక్రాంతి వేళ వ‌రాలు ప్ర‌క‌టించిన భ‌ట్టి
  • ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌ని భ‌రోసా


నల్గొండ – అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామని, ఇక ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.1లక్ష ఇవ్వబోతున్నామన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఆదివాసీల కోసం చట్టాలు చేసి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇక, చట్టాలను అమలు చేయించుకునే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నాది అని ఆయన తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో నేడు జ‌రిగిన ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ… కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో హక్కులతో పాటు స్వేచ్ఛను కోల్పోయామన్నారు. రాష్ట్ర ప్రజలు కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, మీరే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఇండ్ల పంపిణీ బంద్ చేశార‌ని, కానీ తాము మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింద‌ని, కానీ, తాము అధికారంలోకి వచ్చాక మరో రూ.2 వేలు అదనంగా కలిపి మొత్తం 12 వేల రూపాయలను ఇవ్వబోతున్నామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… బ‌డ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ జనాభాకు 10శాతానికి తగ్గకుండా నిధుల కేటాయింపులు చేస్తామని తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారే తప్ప వాటికి మౌలిక సదుపాయాల కల్పన విషయాలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి తండాలో పంచాయతీ భవనం, స్కూల్ బిల్డింగ్, అంగన్ వాడీ కేంద్రాలను నిర్మిస్తామన్నారు. వైద్య సదుపాయానికి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు.

- Advertisement -

రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు మ‌రో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. 2029లో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలు, గిరిజనులకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఆదివాసీలతో కాంగ్రెస్ పార్టీకి పేగుబంధం అన్నారు కోమ‌టిరెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement