పెద్దపల్లిరూరల్, ఫిబ్రవరి 25(ప్రభ న్యూస్): అవినీతి రహిత దేశంగా భారత్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం నలుమూలల విస్తరించేలా సుపరిపాలన అందించిన ఘనత బీజేపీ సర్కార్ దేనని కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీని చేయాలని చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఆదివారం పెద్దపల్లికి చేరుకుంది. పెద్దపల్లి మండలం స వద్ద కేంద్రమంత్రికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లిలో నిర్వహించిన యాత్ర అనంతరం జండా చౌరస్థాలో నిర్వహించిన సభలో కేంద్రమంత్రి మాట్లాడారు.
ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రపంచంలోనే 5వ బలమైన ఆర్థిక దేశంగా భారత్ ఎదిగిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో భారత్ ముందంజలో ఉందని తెలిపారు. పాలనాదక్షుడిగా కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను అంతం చేసే దిశగా మోదీ నిర్ణయాలు ఉండబోతాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళలలు బిజెపికి మరోసారి ఓటు వేసి మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆచరణ సాధ్యంకాని హామీలతో గెలుపొందిందని రూపాలా దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు జరిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెడతామన్నారు. కాంగ్రెస్ స్కాముల పార్టీ అని ఒక ఎంపి ఇంట్లో లెక్కలు తేలని రూ. 3 కోట్ల నగదు దొరకడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బిజెపి పార్టీ 370 స్థానాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ 10ఏళ్ల మోడీ పాలనను చూసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్ధకమన్నారు. బీజేపీ 16 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునిల్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్లమెంట్ ప్రభారి కొప్పు భాష, పార్లమెంటు ఇంచార్జీ రావుల రాంనాథ్, దళిత మోర్చ జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, నాయకులు క్యాతం వెంకట రమణ, పట్టణ అధ్యక్షులు కావేటి రాజగోపాల్, నాయకులు శిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్ రావు, దాడి సంతోష్, మేకల శ్రీనివాస్ యాదవ్, కోదాటి రమణా రావు, పోల్సాని సంపత్ రావు, ఎర్రోళ్ళ శ్రీకాంత్, ఉప్పు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.