తెలంగాణలో సంపదను పెంచుతున్నాం, వాటిని పేద ప్రజలకు పంచుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కళాకారుల నృత్యాలు, పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అహింసా మార్గంలోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నట్టు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడించిందన్నారు.
సొంత స్థలం ఉన్న పేదలకు గృహలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. గృహలక్ష్మీ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. సాగు నీటికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తామన్నారు. ప్రతిపక్షాలు రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. గత పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందన్నారు. గత ప్రభుత్వాల తీరుతో రైతన్నల జీవితాలు ఆగమైనట్టు ఆరోపించారు. అనతి కాలంలోనే తెలంగాణను అభివృద్ధి చేసుకున్నట్టు చెప్పారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి తాము ఏ విధంగా పనిచేస్తున్నామన్నది వివరించే ప్రయత్నం చేశారు. లక్ష మంది గిరిజనులకు పోడు భూములు ఇచ్చినట్టు చెప్పారు. పోడు భూములకు సంబంధించిన ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ దళిత బంధు దేశానికే ఆదర్శమన్నారు. మానవీయ కోణంలో పింఛన్లను భారీగా పెంచామని చెప్పారు. ఆర్టీసీ భారీ నష్టాల్లో ఉందంటూ, చివరికి ప్రభుత్వంలో విలీనానికి నిర్ణయించినట్టు చెప్పారు. బిల్లును సైతం సభలో ఆమోదించుకున్నట్టు చెప్పారు.