భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనకు పార్టీ అధిష్ఠానం నుంచే కాకుండా పలు ప్రజా సంఘాలు సపోర్ట్‌గా నిలుస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఈ తీర్పును వనమా సవాల్ చేయనున్న నేపథ్యంలో ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు అండగా ఉంటామని చెబుతూ తీర్మానం చేశాయి. ఇవ్వాల హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వనమాని కలిసిన పలువురు తమ సంఘీభావం తెలిపారు.
వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా కొత్తగూడెం నియోజక వర్గంలో అన్ని హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఇవ్వాల (శుక్రవారం) భేటీ అయ్యారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు నాయకత్వంలోనే తాము పనిచేస్తామని వారంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. వనమాకు సపోర్టుగా ఉంటామని ప్రతిజ్ఞ కూడా చేశారు.. వనమా వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టతామని, కొంతమంది చేస్తున్న కుట్రలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో కూడా వనమా వెంకటేశ్వరరావుని భారీ మెజార్టీతో గెలిపించుకుని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని తెలిపారు. ఇక.. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసిన వనమా వెంకటేశ్వరరావే తమ నేత అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.