Friday, November 22, 2024

Big Story | తెలంగాణలో పెరుగుతున్న వాహనాలు.. రవాణాశాఖకు భారీగా ఆదాయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ప్రభుత్వం ప్రజా రవాణాను ఎంతగా పటిష్ట పరుస్తున్నా ప్రజలు వ్యక్తిగత వాహనాల పైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కొరోనా తరువాత వ్యక్తిగత భద్రత కోసం ప్రజలు సొంత వాహనాల పైనే ఆధారపడుతున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు ఇలా ఎవరికి వారు వారి ఆర్థిక సామర్ధ్యాన్ని బట్టి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ ఏటా ద్విచక్ర వాహనాలు, కార్ల ధరలు పెరగడంతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నప్పటికీ రాష్ట్రంలో వాహనాల కొనుగోళ్లు ఏమాత్రం తగ్గడం లేదు.

కాలుష్యంతో పాటు ఇంధన ఖర్చులను తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి అంతగా ప్రజాదరణను పొందలేక పోతున్నాయి.రాష్ట్ర రవాణా శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం… తెలంగాణ ఏర్పాటైనప్పటికి రాష్ట్రంలో కేవలం 71 లక్షల 52 వేల వాహనాలున్నాయి. కాగా రాష్ట్రం ఆవిర్భవించిన గత తొమ్మిదేళ్లలో వాటి సంఖ్య ఏకంగా కోటి 53 లక్షలు దాటింది. అయితే, అందులో ద్విచక్ర వాహనాలు దాదాపు మూడో వంతు ఉండటం గమనార్హం. పెరిగిన వాహనాలలో 73.7 శాతం ద్విచక్ర వాహనాలు కాగా, మిగతా 13 శాతం కార్లు ఉన్నాయి.

- Advertisement -

ఆ తరువాతి స్థానాన్ని ట్రాక్టర్లు ఆక్రమించాయి. తెలంగాణ ప్రజలు సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడటంతో పాటు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే సమయం కూడా ఆదా అవుతుందన్న భావనలో ప్రజలు ఉన్నారని ఇందులో భాగంగానే రోడ్లపైకి భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, రోజురోజుకూ పెరుగుతున్న వ్యక్తిగత వాహనాల వినియోగం కారణంగా అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు కూడా ఆదాయం భారీగానే వస్తోంది.

గడచిన తొమ్మిదేళ్లలో రవాణా శాఖ ఆదాయం ఏకంగా 320 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందులోనూ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 52 శాతానికి పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం. కాగా, రాష్ట్రంలో పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలలో బైకులు మొదటి స్థానంలో కార్లు రెండవ స్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో ట్రాక్టర్లు ఉండటం విశేషం. రాష్ట్రం ఏర్పాటైనప్పటికి మొత్తంగా 2.69 లక్షల ట్రాక్టర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్యు 7 లక్షలను దాటింది.

రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుండటం అదే సమయంలో కూలీల కొరత సమస్య ఎదురవుతుండటంతో వ్యవసాయదారులంతా సొంతంగా ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ ఇస్తోంది. ఈ కారణంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. అలాగే, ఇసుక విక్రయం కూడా ఇటీవలి కాలంలో ఓ ఆదాయ వనరుగా మారడంతో నదులు, ఉప నదుల సమీప గ్రామాల్లో ట్రాక్టర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement