హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరోనా జేఎన్.1 వేరియంట్ వ్యాప్తిలో ఉన్న ఈ తరుణంలో ప్రజల్లో చాలా మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతుండడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం గతంతో పోలిస్తే రాష్ట్రంలో 10 నుంచి 20శాతానికి పైగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కేసులు వస్తున్నాయని సాధారణ, ఛాతి, పిల్లల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ – తెలంగాణ శాఖ కు చెందిన వైద్యులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ , సిరిసిల్ల జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రులతోపాటు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ సర్వేకొనసాగింది. ఈ సర్వేలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న ఓపీ రోగుల అనారోగ్య సమస్యలను అధ్యయనం చేయగా అనేక మందిలో శ్వాసకోశ సమస్యలు … గొంతు నొప్పి, గొంతులో మంట, స్వల్పస్థాయి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఊపిరితిత్తుల్లో సమస్యలు, ఒంటినొప్పులు ఉన్నట్టు తేలింది.
అయితే సరిగ్గా ఇవే అనారోగ్య సమస్యలు కరోనా కొత్త వేరియంట్‌జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలోనూ వెలుగు చూస్తుండడంతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది. కాగా… ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పేషెంట్లలో 98శాతం మంది వైద్యులు చేసే చికిత్సతోనే కోలుకుంటుండడంతో పరిస్థితి ఇంకా అదుపులోనే ఉందని అధ్యయనం తేల్చింది. మరోవైపు ఇటీవలికాలంలో చిన్నారుల్లో గవద బిళ్లలు (ట్రాన్సిల్స్ ) సమస్యలతో కూడిన కేసులు కూడా అధికంగా వస్తున్నాయని ఐఎంఏ అధ్యయనం వెల్లడించింది.
మరికొందరిలో కీళ్ల నొప్పులు వస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో ఆస్తమా లేని వారిలోనూ వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని ఐఎంఏ అధ్యయనం చెబుతోంది. తాజా అధ్యయనం నిర్వహించిన వారిలో డాక్టర్ ప్రతిభ, డాక్టర్ ఏపీ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ అశీష్ చౌహాన్, డాక్టర్ సురేష్, డాక్టర్ సుశాంక్, డాక్టర్ సంజయ్, డాక్టర్ బాపురెడ్డి, డాక్టర్ కొత్తూరు శ్రీశైలం ఉన్నారు.