హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇప్పుడు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ఎక్కడ మారు మూల చూసినా రూ.50 లక్షలకు ఎకరం తగ్గడంలేదు. భారీగా పెరిగిన వ్యవసాయ భూముల ధరలతో ప్రభుత్వానికి కొత్త చిక్కులొస్తున్నాయి. రైతుబంధుతో పాటు, వ్యవసాయానికి ఊతంగా ప్రాజెక్టుల రాకతో రైతులు భూములనమ్మేందుకు విముఖత చూపిస్తున్నారు. ఒకవైపు ప్రాజెక్టులు, రహదారులకు భూ సేకరణతోపాటు దళితులకు భూ పంపిణీపై పెను ప్రభావంపడుతోంది. భూముల కొరతతోపాటు, అత్యంత ఖరీదుగా మారిన భూములతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడచిన ఆర్ధిక ఏడాదిలో రూ.428 కోట్లను ప్రభుత్వం దళితుల భూ పంపిణీకి కేటాయించింది. దీంతో 10వేల మంది లబ్దిదారులకు అవసరమైన భూములను కొనుగోలు చేసి పంచడంద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు తేవాలని యోచించారు. అయితే క్షేత్ర స్థాయిలో భూముల కొనుగోలుకు అధికారులు ప్రయత్నించగా భూములు దొరకడమే గగనంకాగా, ప్రభుత్వ నిర్ధేశిత ధరకు ఏ మారుమూలకు వెళ్లినా భూములనమ్మేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి ఎదురైంది. భూ పంపిణీకి 11 జిల్లాలకే ప్రణాళిక సిద్దం చేశారు. తొలుత 28 జిల్లాలకు పథకం ద్వారా భూములివ్వాలని ప్రభుత్వం భావించినా భూముల ధరలు అందుబాటులో లేకపోవడం, మరోవైపు ప్రభుత్వ భూములు లేకపోవడంతో జిల్లాల సంఖ్యను కుదిస్తూ వచ్చారు.
ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంభ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో భూ పంపిణీ పథకానికి యోచించారు. అయితే ఇందుకు అనుగుణంగా అధికారులకు సూచనలు వెళ్లగా, భూములు విక్రయించేవారు లేరని ప్రభుత్వానికి నివేదిక అందింది. విక్రయదారులనుంచి దరఖాస్తులు కోరగా పెద్దగా స్పందన రాలేదు. 2017-18లో 3వేల మందికి భూములు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోగా నిర్ధేశిత ఏ జిల్లాలోనూ భూములు లక్ష్యం కాలేదు. 3610 ఎకరాలను గుర్తించిన అధికారులు, కొనుగోలు ధరగా రూ.164.34 కోట్లుగా తేల్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపగా రూ.64 కోట్లకే ఆమోదం వచ్చింది. మరో రూ.100 కోట్లు మంజూరీ కాకుండానే నిల్చిపోయాయి.
ఇరిగేషన్‌కు శరవేగంగా…
కాగా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించి, పరిహారం, పునరావాసం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎక్కడా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు సుమారుగా 2.7లక్షల ఎకరాల భూ సేకరణను అతి కష్టం మీద సాకారం చేసుకుంది. చివరకు అటవీ భూముల సేకరణ కూడా పర్యావరణ, అటవీ శాఖల అనుమతులను పొందుతూ ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణ అనుకున్న సమయంలో పూర్తి చేస్త్తున్నారు. మరోవైపు భూమి కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉండటం, ఇతర చోట్ల భూములు, ఇండ్ల స్థలాలను ఇవ్వడంతో ప్రగతి సాధ్యమవుతోంది. ప్రధానంగా భారీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 90 వేల ఎకరాలు సేకరించగా, వరంగల్‌లో 73వేల ఎకరాలు, మెదక్‌లో 57 వేల ఎకరాలను సేకరించి ప్రాజెక్టుల ప్రగతికి అవసరమైన కార్యాచరణను ఇబ్బందులున్నా చిత్తశుద్దితో పూర్తి చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.