హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవికి ఎన్నికైన పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన భద్రత కల్పించింది. ఆయన ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి, రేవంత్ నివాసం వద్ద బారికేడ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ప్రొటొకాల్ వాహనాలు కూడా అందుబాటులో ఉంచారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దనే నిలిపివేస్తున్నారు. రేవంత్ నివాసం వైపు ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు సచివాలయంలో ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయాన్ని కూడా సాధారణ పరిపాలన శాఖ అధికారులు ముస్తాబు చేస్తున్నారు.
ఇంకోవైపు సీఎం కాన్వాయ్ వాహనాలను సైతం సిద్ధం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణులతో పాటు అంతా హైకమాండ్ ప్రకటన కోసం ఎదురుచూపులు పడుతున్నారు. అధికారులు మాత్రం తమ ప్రోటోకాల్ మేరకు చేయాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 7న సీఎం, మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.