హైదరాబాద్, ఆంధ్రప్రభ : పేద ప్రయాణికులకు భారంగా మారిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని బీఎస్పీ రాష్ట్ర ఆధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆరుసార్లు ఆర్టీసీ చార్జీలను పెంచారని, మరోసారి పెంచేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ తన ప్రయాణానికి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ప్రవీణ్ కుమార్ చేపట్టిన 88వ రోజు యాత్ర భద్రాచలం నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాచలంలోని సీతారామ దేవాలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.
భద్రాచలం నియోజకవర్గం ఎస్టీ రిజర్వు అయినప్పటికీ ఆ ప్రాంతంలోని గిరిజనులు అనేక సంవత్సరాలుగా వెనుకబడే ఉన్నారని అన్నారు. ఈ ప్రాంత ఏజెన్సీ ప్రాంతంలో ఆధిపత్య వర్గాల వారికి భూమి పట్టాలిచ్చి పేదలకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ జైలుకు పంపుతున్నారని ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5లో పేర్కొన్న విధంగా గిరిజనులకు అన్ని హక్కులు ఇచ్చే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేవన్నారు.
పుస్తకాలను అందజేయకుండా పాఠశాలలను ప్రారంభిస్తే పిల్లలు ఏమి చదువుతారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నప్పటికీ పరీక్షలను ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు బీయస్పీ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆదివాసీలలోని గుత్తికోయలకు ఎలాంటి గుర్తింపు లేక శరణార్ధులుగా జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలంతా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని , బీయస్పీ అధికారంలోకి వస్తే ఆదివాసీ పిల్లలను అద్భుతంగా చూసుకుంటామని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.