న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా జనవరి నెలలో బొగ్గు ఉత్పత్తి పెరిగిందని కేంద్ర బొగ్గు శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే 6.13 శాతం పెరిగి మొత్తం 79.60 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించినట్టు ప్రకటించింది. సొంత గనులున్న సంస్థలు ఉత్పత్తిలో 45 శాతం వృద్ధి సాధించాయని పేర్కొంది. అలాగే బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సైతం జనవరిలో 9.2 శాతం పెరిగిందని పేర్కొంది. బొగ్గు ఉత్పత్తిలో వృద్ధిని సాధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కోల్ ఇండియా లిమిటెడ్ 2.35 శాతం వృద్ధి రేటు సాధించగా, సింగరేణి కాలరీస్ 5.42 శాతం వృద్ధి రేటుతో కోల్ ఇండియాను వెనక్కు నెట్టింది.
ఉత్పత్తి, వినిమయానికి సంబంధించి గణాంకాలను 2020తో సరిపోల్చి చూస్తున్నామని, 2021, 2022 సంవత్సరాల్లో కోవిడ్-19, లాక్‌డౌన్ల ప్రభావం కారణంగా తీవ్రమైన హెచ్చుతగ్గులున్నందున, 2020ని సాధారణ సంవత్సరంగా పరిగణిస్తూ, ఆ ఏడాది గణాంకాలతో పోల్చి చూస్తున్నట్టు కేంద్ర బొగ్గు శాఖ తెలియజేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..