ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్సీ హాస్టల్ సంక్షేమ అధికారులు ఎస్సీ సంక్షేమ కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎస్సీ హాస్టళ్ల ద్వారా ఎస్సీ విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత జిల్లాలో 15 ఎస్సీ బాలికలు, బాలుర వసతి గృహాలున్నాయని, వాటిలో 413 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని, వసతి గృహ సంక్షేమ అధికారుల ద్వారా హాస్టళ్ల పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నిరుపేద ఎస్సీ విద్యార్థులు చాలా మంది ఉన్నారని, జిల్లాలో గల 15 ఎస్సీ హాస్టళ్లలో కనీసం 1500 మంది విద్యార్థులు ఉండాలి.. కానీ 413 మంది మాత్రమే ఉన్నారని, ఎస్సీ వసతి గృహ సంక్షేమ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రణాళిక ప్రకారం ఎస్సీ విద్యార్థులు అధికంగా ఉన్న ఆవాసాలకు వెళ్లి సంక్షేమ హాస్టళ్లలో కల్పిస్తున్న వసతులపై అవగాహన కలిగించి, ఎస్సీ హాస్టళ్లలో ప్రవేశం పొందేలా చూడాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా, చదువులో ముందుండేలా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ఆన్ లైన్ లో పొందుపరచాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, హాస్టళ్ల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పనికిరాని పాత సామాన్లను, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.
హాస్టల్ కు అవసరమైన చిన్న చిన్న మరమ్మతు పనులను పది రోజుల్లోగా చేయించాలని, గోడలపై దేశభక్తి, మంచి సూక్తులను రాయించాలన్నారు. ఖాళీ స్థలం ఉంటే కిచెన్ గార్డెన్ లను ఏర్పాటు చేయాలని, స్కాలర్ షిప్ డబ్బులు విద్యార్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.. కాబట్టి డే స్కాలర్ విద్యార్థుల వద్దకు వెళ్లి స్కాలర్షిప్ కు అప్లై చేయించాలని, పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల కోసం కళాశాలలో క్యాంపు వేసి రెవెన్యూ అధికారుల సహకారంతో క్యాస్ట్ సర్టిఫికెట్ అందించి స్కాలర్ షిప్ లకు అప్లై చేయించాలని, పదవ తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెప్పించాలన్నారు. అలాగే ముఖ్యంగా విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని, ప్రతినెలా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటిండెంట్, సిబ్బంది, వసతి గృహ సంక్షేమ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital