Friday, November 22, 2024

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల పెంపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. ఆరోగ్య శ్రీ పథకం కింద జిల్లాల వారీగా ప్రయివేటు ఆసుపత్రుల్లో ఎంత మంది రోగులు చికిత్స పొందుతున్నారు…?, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది చికిత్స తీసుకుంటున్నారు..? అన్న వివరాలను ప్రత్యేకంగా తెలుసుకుంటోంది. ప్రతి నెలా జిల్లాల నుంచి ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ రిపోర్టులను తెప్పించుకుంటోంది. గడిచిన ఏడాది 2021-22లో ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రయివేటులో ఎన్ని చికిత్సలు జరిగాయి..?, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని చికిత్సలు జరిగాయి..? అన్న వివరాలను జిల్లాల వారీగా తెప్పించుకుంది. ఆ ఏడాదిలో జరిగిన ఆరోగ్య శ్రీ చికిత్సల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్ని జరిగాయో ఆరా తీస్తోంది. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందుతూ ఇన్‌పేషెంట్‌ లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలను ఆయా జిల్లాల డీఎంఅండ్‌హెచ్‌వోల నుంచి సేకరించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలను తీసుకుంటే గడిచిన ఏడాదిలో ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రంగారెడ్డి జిల్లాలోని రోగుల్లో కేవలం 1శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు. మిగతా 99శాతం ఆరోగ్య శ్రీ రోగులు ప్రయివేటు ఆసుపత్రులనే ఆశ్రయించారు.

ఇక మేడ్చల్‌లో 6శాతం మాత్రమే రోగులు ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 14శాతం ఆరోగ్య శ్రీ కేసులకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు సేవలందించాయి. రాష్ట్రంలోని దాదాపు మరో పది జిల్లాల్లో 40శాతం కంటే తక్కువగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలను రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొందారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలను పెంచడంపై ఒకటి, రెండు రోజుల్లో వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు సమీక్షించనున్నా రు. రాష్ట్రంలోని మారుమూల, ఏజెన్సీ జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన పెంచాలని మంత్రి నిర్ణయిం చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బందే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రయివేటులో చేర్పిస్తున్న విషయం మంత్రి హరీష్‌రావు దృష్టికి వచ్చింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఎప్పటికప్పుడు వైద్య, ఆరోగ్యశాఖ ఆరా తీస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement