Sunday, November 3, 2024

TS: కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం సంతోషదాయకం.. ఎంపీ అర‌వింద్

నిజామాబాద్, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్): ప్రధాని మోడీ చేతుల మీదుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం వర్చువల్ గా ప్రారంభించుకోవడం సంతోషదాయకమ‌ని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు శ్రద్ద చూపి విద్యలో ఉన్నత మార్కులు వచ్చేలా చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఖిల్లా మినీట్యాoక్ బండ్ వద్ద నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధ‌న్ పాల్ సూర్యనారాయణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.


ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… దేశానికి ప్రధాని మోడీ అయ్యాక ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగిందని తెలిపారు. రూ.22 కోట్లతో కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనాన్ని మన దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోష దాయకమన్నారు. కోవిడ్ వల్ల భవన నిర్మాణ పనులు కొద్దిగా ఆలస్యమైందని చెప్పారు.. నయా పైసా కమిషన్ లేకుండా పూర్తిగా రూ.22 కోట్లతో ఈ విద్యాలయం ప్రారంభించుకున్నామని తెలిపారు. 441మంది విద్యార్థులు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకున్నారని, త్వరలో సెక్షన్-2 కూడా ప్రారంభించుకుంటామని తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రెండవ సెక్షన్ కి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా పదవ తరగతి అనంతరం ఆపై తరగతులు కూడా నిర్వహించేందుకు కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.

పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తల్లిదండ్రులు వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, టైం టేబుల్ నియమించాలన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జమ్మూ కాశ్మీర్ స్వస్థలాన్ని వదిలి వెళ్ళిన వారు తిరిగి 40 సంవత్సరాల తర్వాత వారి స్వస్థలానికి వచ్చేలా ప్రధాని మోడీ కృషిచేసి వారికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలతో.. సంపూర్ణ ఆయుష్షుని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఎంపీ అరవింద్ కోరారు. కేంద్ర విశ్వవిద్యాలయంలో సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటుకి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ముందుకు రావడంపై అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement