తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల చివరిరోజు జరిగే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈనెల 22న నిర్వహించే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ సమావేశంపై ఇవ్వాల (శనివారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ.. అమరవీరుల స్మారక కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం జరిగే కార్యక్రమానికి ముందు డా. బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవరణం నుండి దాదాపు ఐదు వేల మంది కళాకారులచే ర్యాలీ ఉంటుందని, కళాకారుల తర్యాత దాదాపు రెండు వేల మంది మహిళలు, పూణే నుండి ప్రత్యేకంగా వచ్చే బ్యాండ్ కళాకారులు, వారి వెనుకే వేలాది మంది నగర వాసులు, కార్యకర్తలు ఊరేగింపు ద్వారా వేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు.
హైదరాబాద్ సిటీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కార్లలో కాకుండా మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వస్తారని మంత్రి తలసాని చెప్పారు. ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం, ముఖ్యమంత్రి ఉపన్యాసం ఉంటుందని, ఆ తర్వాత అద్భుతమైన డ్రోన్ షో ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ అంజనీ కుమార్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.