నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి దంపతులతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు సుమారు 2వేల మంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన చక్రం తిప్పుతున్నారు. జిల్లాలోని తన స్థానంతో పాటు మరో నాలుగు స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి తీరాలన్న దృఢ సంకల్పంతో వ్యూహరచన చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలోని మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల విషయంలోనూ సుదర్శన్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మండవ వెంకటేశ్వరరావును బరిలో దించనున్నట్లు పెద్ద యెత్తున ప్రచారం జరుగుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో 16 మంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధిష్టానం నేటికి అభ్యర్థిని ప్రకటించలేకపోయింది.
బాన్సువాడ నియోజకవర్గం నుండి ఏనుగు రవీందర్ రెడ్డిని బరిలో దింపాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ప్రతిష్టానం వ్యూహ ప్రతి వ్యూహాలను పన్నుతుంది. నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు కావడం మచ్చలేని నాయకుడిగా నీతి నిజాయితీతో మాజీ మంత్రిగా మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి కావడంతో ఆయన మాటను ఎవరు కాదనలేకపోతున్నారు.