Friday, November 22, 2024

Order Order: ప‌బ్బుల విష‌యంలో మ‌రోసారి విచార‌ణ‌.. సౌండ్స్ వ‌ద్దంటూ హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నడుస్తున్న పబ్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజే శబ్దాలు లేకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పబ్బుల్లో నిర్దిష్టమైన శబ్దాలు ఉండేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్బులపై కేసులు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసులకు హుకుం జారీ చేసింది. ఈ కేసుపై దసరా సెలవుల తర్వాత మరోసారి విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్‌లోని పబ్బులపై హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 10దాటితే పబ్బుల్లో ఎలాంటి డీజే శబ్దాలు ఉండరాదని ఆదేశించింది.

సిటీ పోలీసు చట్టం , సౌండ్‌ పొల్యూషన్‌ రెగ్యులేషన్‌ ప్రకారం లౌడ్‌ స్పీకర్లకు నిర్దేశిత సమయం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. రాత్రివేలల్లో ఎలాంటి శబ్దాలు, డీజే సౌండ్‌లకు అనుమతి లేదని పేర్కొంది. ఇళ్లు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్బులకు ఎలా అనుమతించారని గతంలోనే హైకోర్టు ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణనలోనికి తీసుకుని పబ్బులకు అనుమతించారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఎక్సైజ్‌శాఖను హైకోర్టు ఆదేశించింది. పబ్బుల్లో రాత్రిపూట లిక్కర్‌ మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశం మేరకు పబ్బుల అనుమతులు, చర్యలపై పోలీసులు సోమవారం కౌంటర్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్లు పబ్బుల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక అందజేశారు.

స్రవంతి నగర్‌ వెల్ఫేర్‌ కమిటీ, జూబ్లిహిల్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌తోపాటు పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు టాట్‌ పబ్బుపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వీరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతీ రోజూ అర్ధరాత్రి కాగానే పబ్బుల నుంచి భారీ ఎత్తున శబ్దాలు వస్తున్నాయని, దీనివల్ల నిద్రా భంగం కలుగుతోందని, కాలనీకి సమీపంలో ఉన్న పబ్బును తొలగించాలని పిటీషన్‌లో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement