న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గడిచిన ఎనిమిదేళ్లలో జాతీయ పశుసంవర్థక మిషన్‌లో (ఎన్‌ఎల్‌ఎం) తెలంగాణకు రూ. 53.94 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పశు సంవర్థక శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల మంగళవారం సమాధానమిచ్చారు. తాము విడుదల చేసిన నిధులలో తెలంగాణ సర్కార్ కేవలం రూ. 27.71 కోట్లు మాత్రమే వినియోగించుకుందని తెలిపారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 100 మొబైల్ వెటర్నరి యూనిట్ల (ఎంబీయూ) సేకరణ, నిర్వహణ కోసం రూ. 16 కోట్లు కేటాయించామన్నారు. 2021-22 కాలంలో తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ఎన్ఎల్ఎం కింద రూ. 69.56 కోట్ల సహాయం కోసం ప్రతిపాదనలు పంపిందని కేంద్రమంత్రి చెప్పారు. అయితే ఎన్ఎల్ఎం కింద వివిధ ప్రొగ్రాంల అమలు కోసం రూ. 5.42 కోట్లు మంజూరు చేశామని జవాబులో పేర్కొన్నారు.