ప్రభన్యూస్ : పీఆర్సీ అమలుకు కీలకమైన పెండింగ్ జీవోలు జారీ చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌లు ప్రభుత్వాన్ని కోరారు. సీఎస్ సోమేష్‌కుమార్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావులను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగులు తమ మూల వేతనాలనుంచి ఒక శాతం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వారికి వివరించారు. హౌసింగ్ బోర్డు, హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలను ప్రభుత్వం విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ హౌసింగ్ కార్పొరేషన్‌ను ప్రభుత్వ శాఖలో విలీనం చేయడాన్ని ఉద్యోగుల కోణంలోనే కాకుండా తెలంగాణ అభివృద్ధి కోణంలో కూడా స్వాగతిస్తున్నామని, హౌసింగ్ కార్పొరేషన్ విలీన ప్రక్రియ పూర్తయ్యేలోపు అందులో పని చేస్తున్న పూర్తిస్థాయి అర్హతలు కలిగి ప్రమోషన్ల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, తద్వారా ఉద్యోగుల ఆత్మస్థైర్యం పెరిగి భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు అందే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎన్జీవోల సంఘం హైదరాబాద్ నగర శాఖకు వసతి కల్పించాలని కోరారు. టీఎన్జీవో సంఘం విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని, తెలంగాణ అభివృద్ధిలో టీఎన్జీవో సంఘం గణనీయమైన పాత్ర పోషిస్తోందని మంత్రి కొనియాడారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital