వడ్డేపల్లి, (ప్రభన్యూస్): గ్రేటర్ వరంగల్ పరిధి 60వ డివిజన్ వడ్డేపల్లి సుబేదారి ప్రధాన రహదారిలో రెడీమేడ్ ఇల్లు నగర వాసులను ఆకట్టుకుంటోంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ఒక ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే శాశ్వతంగా ఆ చోటే ఉంటుంది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కదిలే ఇళ్లు(రెడీమేడ్) వస్తున్నాయి. వడ్డేపల్లికి చెందిన బొల్లెపల్లి సతీష్‌గౌడ్, సుహాసిని దంపతులు వడ్డేపల్లికి ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలనుకున్నారు.
నేటి రోజుల్లో ఇల్లు కట్టాలనుకుంటే అన్నింటికీ ధరలు పెరగడంతో రెడీమేడ్ గురించి తెలుసుకొని 432 స్క్వేర్‌ఫీట్లతో 60 గజాల్లో 8 పిల్లర్స్ ఐదుఫీట్ల ఎత్తుతో రూ.8.50 లక్షలతో కిచెన్, సింగిల్ బెడ్‌రూమ్, అటాచ్డ్ బాత్‌రూమ్, హాల్‌తో పూర్తిగా ఐరెన్ ఉపయోగించిన మొబైల్ ఇల్లును నిర్మించారు. లారీలో తీసుకొచ్చి బిగించేశారు. ఈ ఇల్లును ఎక్కడికైనా తరలించుకునే అవకాశం ఉంది. 30 ఏళ్లకు పైగా పటిష్టంగా ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టాలనేదే లక్ష్యం : బొల్లెపల్లి సతీష్‌గౌడ్ (ఇంటియజమాని)
ఇల్లు కట్టాలనేది ఒక కల. ప్రజల్లో కొత్త దనాన్ని చూపించాలనే తపనతో 60 గజాల్లో అతి తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో మొబైల్ ఇల్లు నిర్మించినట్లు యజమాని బొల్లెపల్లి సతీష్‌గౌడ్ చెప్పారు. ఈ పోటీ ప్రపంచంలో ఇల్లు కట్టాలంటే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అన్నారు. తనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ రెడీమేడ్ ఇల్లును నిర్మించుకొని ఖర్చును తగ్గించుకోవాలని సూచించారు.
చల్లదనంగా మొబైల్ హౌజ్ : మేనేజింగ్ డైరెక్టర్ జిలాని
ఈ మొబైల్ హౌజ్ పూర్తిగా ఫైన్‌హుడ్, ఐరెన్, ఫాంప్యానల్‌తో తయారుచేయడంతో పూర్తిగా చల్లదనం ఉంటుందని మొబైల్ హౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌కె. జిలాని తెలిపారు. ఈ రెడీమేడ్ ఇళ్లు ఎక్కువగా రిసార్ట్స్, ఫాంహౌజ్, రియల్‌ఎస్టేట్ వెంచర్లల్లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 250కు పైగా ఏర్పాటు చేశామని చెప్పారు. లారీల ద్వారా ఈ మొబైల్ హౌజ్‌ను ఎక్కడి కైనా తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. అతి తక్కువ ఖర్చుతో ఇన్‌టైమ్‌లో ఇల్లును పూర్తిచేస్తామని వెల్లడించారు. ఈ మొబైల్ ఇల్లు మొదట 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుందని జిలాని పేర్కొన్నారు.