Monday, November 25, 2024

KTR: హామీలు అమ‌లు చేయ‌మంటే మా మీదే విమ‌ర్శ‌లా – కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్‌: వంద‌ రోజుల్లో 6గ్యారంటీలు అమలు చేస్తామన్నారని.. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. నెరవేరని తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనన్నారు. తెలంగాణ భ‌వ‌న్ లో నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మోసం చేయడమే కాంగ్రెస్‌ నైజమని విమర్శించారు. బస్సు ఉచితం, బంగారం ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. మొత్తం 420 హామీలు ఇచ్చింద‌ని, వాటిని అమ‌లు చేయ‌మంటే త‌మ‌పై కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డుతున్నార‌ని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిప‌డ్డారు..బంగారు పళ్లెంలో తెలంగాణ అభివృద్ది చేసి కాంగ్రెస్ చేతిలో పెడితే ఖాళీ ఖ‌జానా ఇచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ నేత‌లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు.. మహాలక్ష్మి పథకం పెట్టి మహిళల మధ్య గొడవలు పెట్టార‌న్నారు.. ఫ్రీ బస్సు మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచాల‌ని కోరారు.

రాష్టంలో కోటి 57 లక్షల మంది మహిళలకు 2500/- రూపాయలు ఇస్తామన్నార‌ని, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కెటిఆర్. కరెంటు బిల్లులు సోనియా గాంధీ కడుతుంది అని చెప్పారని, మ‌రి ఆ బిల్లులు ఎప్పుడు క‌డ‌తార‌ని ప్ర‌శ్నించారు.. బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిషన్ రెడ్డి అంబర్ పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయి సానుభూతితో ఎంపీగా గెలిచారంటూ.. ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి అయ్యాక ఒక బస్తీకి అయినా మంచి పనిచేశారా అని మండిపడ్డారు కేటీఆర్‌….

పథకాలు తెచ్చే ముందు అన్నీ ఆలోచించుకోవాలని కాంగ్రెస్‌కు చురకలంటించారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని, వారిది ఫెవికాల్‌ బంధమని విమర్శలు గుప్పించారు. ఏదో ఒక షరతుపెట్టి పథకాలు రాకుండా చేస్తారని.. పార్లమెంట్‌ ఎన్నికల గండాన్ని ఎలా దాటాలనేదే కాంగ్రెస్‌ ఆలోచన అని తెలిపారు. తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు పంపిస్తే రాజకీయ సంబంధాలు ఉన్నాయని గవర్నర్‌ తిరస్కరించారన్న కేటీఆర్ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి వెళ్లి గవర్నర్‌ను కలవగానే ఇద్దరు ఎమ్మెల్సీలను ఖరారు చేశారని గుర్తు చేశారు.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కొన్ని జిల్లాల్లో ఓటమి చెందామ‌ని అంటూ రాష్ట్రం బాగుంటుందని జీహెచ్‌ఎంసీలో బీఆర్‌ఎస్‌ క్లీన్ స్వీప్ చేసింద‌న్నారు… హైదరాబాద్‌లో వచ్చిన ఫలితాలు జిల్లాల్లో ఎందుకు రాలేదని పార్టీ క్యాడర్ అనుకుంటుంద‌ని వివ‌రించారు.. ఇవాళ మనకు జరిగింది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేన‌ని, ఏమాత్రం నిరాశ చెందకూడద‌ని కార్య‌క‌ర్త‌ల‌కు ధైర్యం చెప్పారు… కేసీఆర్ బలంగా ఉన్నారని తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పలితాలు సాధించాలని కోరారు..

రాహుల్ జోడో యాత్ర అని తిరుగుతుంటే, ఇండియా కూటమి రాహుల్‌ను కాదని చోడో అని వెళ్లిపోతున్నార‌న్నారు… ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నిర్వీర్యం అవుతోంద‌ని కెటిఆర్ జ్యోస్యం చెప్పారు.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపుతో సమాధానం చెప్పాలని తెలిపారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌తో కాదని.. అందుకే కూటమిలో నుంచి నేతలు బయటకు పోతున్నారని అన్నారు. దేశంలోని పార్టీలన్నింటిని కూడగట్టి కూటమి పెడతామని కాంగ్రెస్‌ బిల్డప్‌ ఇచ్చిందని మండిపడ్డారు. కూటమికి బిహార్‌లో నితీష్‌ కుమార్‌ కూడా బైబై చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్‌, మమతా బెనర్జీ, పినరయి విజయన్‌ లాంటివారే నరేంద్ర మోదీని గద్దె దించగలరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement