హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీ-ల్లో ఇప్పటికే రెండు అమలు చేయగా మరో నాలుగు హామీలను నెరవేర్చేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లి ఎన్నికల్లో పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించగా ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు- తెలుస్తోంది. ఈ పథకం అమలుకోసం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో తెలంగాణలోనూ కొత్త పోర్టల్ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో కోటి 31లక్షల 48 వేల గృహాలకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 200 యూనిట్ల లోపు వాడుతున్న కనెక్షన్ల సంఖ్య 1 కోటి 5లక్షలు ఉంటాయని అధికారులు అంచనా వేశారు.
ప్రతి నెలా కరెంట్ బిల్లులపై డిస్కంలకు రూ.350 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్రభుత్వం ఉచిత కరెంట్ పథకం అమలు చేస్తే ఏడాదికి సర్కార్‌పై రూ.4,200 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అయితే కోటి 5 లక్షల ఇళ్లకు ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తే ఈ సొమ్మంతా విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యుత్ సరఫరాకు రూ.7.07 పైసలు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం కూడా 200 యూనిట్ల వరకు ప్రభుత్వం వివిధ కేటగిరీల వారీగా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది.
50 యూనిట్ల వరకు రూ.1.90 పైసలు, 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు రూ.3.10 పైసలు, 101 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు రూ.3.40 పైసలు గృహాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థులు వసూలు చేస్తున్నాయి. మిగతా డబ్బు సబ్సిడీకింద ప్రభుత్వం విద్యుత్ (డిస్కంలు) పంపిణీ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం ఒక యూనిట్ సరఫరాకు రూ.7.07 పైసలు ఖర్చు అవుతుండగా, ఇప్పుడు 200 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి ఏసీఎస్ కంటే తక్కువ చార్జీలే వసూలు చేస్తున్నారు.
కర్ణాటక తరహాలో ప్రత్యేక పోర్టల్..
ఉచిత కరెంట్ పొందే 1.05 కోట్ల ఇళ్ల వినియోగదారుల వివరాల నమోదుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద చేరదల్చిన వినియోగదారులు కరెంట్ కనెక్షన్ల వివరాలన్నీ అందులో నమోదు చేయాలి. కర్ణాటకలో అమలవుతున్న గృహజ్యోతి పథకానికి వినియోగదారులు సైతం నేరుగా నమోదు చేసుకునే అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదే తరహాలో ఇక్కడ కూడా అమలుకు డిస్కంల నుంచి ప్రాథమికంగా తెలంగాణ ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది.
పోర్టల్‌లో వినియోగదారుడి కరెంట్ కనెక్షన్ వివరాలు నమోదు చేయగానే గత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున ఎన్ని యూనిట్లు వాడారో తెలుస్తుంది. అదే సగటు ప్రకారం కర్ణాటకలో వినియోగదారులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు. అదే పద్ధతిని తెలంగాణలో పాటించాలా? లేదా 200 యూనిట్లు వాడే కోటి 5 లక్షల గృహాలకు ఇవ్వాలా? అన్నదానిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.